నస్పూర్: ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం ఆయన నస్పూర్‌లోని కేజీబీవీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపా రు. అభివృద్ధి పనులు త్వరగతిన పూర్తి చేయాలని సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల రూరల్ సీఐ గోపతి రవీందర్, తహసిల్దార్ సంతోష్, డిప్యూటీ తహసీల్దార్ హరిత పాల్గొన్నారు.
ఓసీ ప్రతిపాదిత స్థలాల పరిశీలన
తాండూర్/కాసిపేట: బెల్లంపల్లి ఏరియా పరిధిలోని ప్రతిపాదిత మహావీర్‌ఖని ఓపెన్‌కాస్ట్ ప్రభావిత ప్రాంతం, కాసిపేట మండలం పెద్దనపల్లి పంచాయతీలో కేకే ఓసీ నాన్‌ఫారెస్ట్ ల్యాండ్ భూసేకరణ ప్రతిపాదిత ప్రాంతాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం పరిశీలించారు. ఎంవీకే–1 పాత చెక్‌పోస్టు నుంచి ఎంవీకే–3 గ్రామ శివారు వరకు ఉన్న ఓపెన్‌కాస్ట్ ప్రభావిత ప్రాంత వివరాలను సింగరేణి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌కుమార్, తాండూర్ తహసీల్దార్ జ్యోత్స్న, బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీరాంరమేష్, ప్రాజెక్టు మేనేజర్ మహేష్, మండల సర్వేయర్ రామకృష్ణ, మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ, కేకే ఓసీ పీఓ రాంబాబు పాల్గొన్నారు.


