మినీ స్టేడియం కలేనా..! | - | Sakshi
Sakshi News home page

మినీ స్టేడియం కలేనా..!

Jul 23 2026 1:30 AM | Updated on Jul 23 2026 1:30 AM

2014లో నిర్మాణానికి నిధులు మంజూరు

రెండేళ్ల క్రితం 12ఎకరాల స్థలం ఎంపిక

శిలాఫలకం ఆవిష్కరణకే పరిమితం

ఇబ్బందుల మధ్య ఖేలో ఇండియా బాక్సింగ్‌ శిక్షణ

మంచిర్యాలటౌన్‌: రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో వివిధ క్రీడలు, అథ్లెటిక్స్‌లో రాణిస్తున్న జిల్లా క్రీడాకారులు సాధన చేసేందుకు సరైన సౌకర్యాలతో కూడిన మైదానం కరువైంది. జిల్లా కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణానికి 2014లో ప్రభుత్వం రూ.2.60కోట్లు విడుదల చేసినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. బస్టాండ్‌ పక్కనే జెడ్పీ బాలుర పాఠశాల మైదానంలోని స్థలాన్ని ఎంపిక చేయగా.. అది పాఠశాల స్థలం కావడంతో కోర్టు కేసుల వరకు వెళ్లగా పనులు నిలిపివేశారు. సరైన క్రీడా మైదానం లేకపోయినా క్రీడాకారులు తమలోని ప్రతిభతో రాణిస్తున్నారు. ఏదైనా రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహించాలంటే జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో తాత్కాలికంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే క్రీడాకారులకు ఏదో ఒక పాఠశాలలో వసతి కల్పించాల్సి వస్తోంది.

శిలాఫలకానికే పరిమితం

జిల్లా కోల్‌బెల్ట్‌ ప్రాంతం కావడం, అడవులు, పారిశ్రామిక ప్రాంతాలు, పల్లె, పట్టణాల కలబోతతో వ్యాపించి ఉంది. కబడ్డీ, వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, అథ్లెటిక్స్‌, హ్యాండ్‌బాల్‌, బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌ వంటి ఎన్నో క్రీడల్లో క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా సెంటర్‌ను జిల్లాకు కేటాయించడంతో బాక్సింగ్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. స్టేడియం లేకపోవడంతో జెడ్పీ పాఠశాల మైదానంలోనే శిక్షణ నిర్వహిస్తున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ప్రత్యేక చొరవతో మంచిర్యాలలోని సాయికుంటలో 12ఎకరాలు స్పోర్ట్స్‌ స్టేడియం కోసం కేటాయించారు. శిలాఫలకం ఆవిష్కరించినా స్పోర్ట్స్‌ అథారిటీ నుంచి పూర్తి స్థాయి అనుమతి రాకపోవడంతో నిర్మాణం ముందుకు సాగలేదు.

శిక్షణకు ఇబ్బందే..!

ఖేలో ఇండియా బాక్సింగ్‌ శిక్షణకు రెండున్నరేళ్ల క్రితం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల భవనంలోనే గదులు కేటాయించారు. పాఠశాల మైదానంలోనే శిక్షణ ఇచ్చేలా ఏర్పాటు చేశారు. వర్షాకాలంలో చిన్నపాటి వర్షానికే మైదానం నీటితో నిండి బురదగా మారుతోంది. ఇదే బడిలో ప్రీప్రైమరీ పాఠశాల ఏర్పాటుతో ఖేలో ఇండియా కోసం వినియోగిస్తున్న గదులు ఇటీవల ఖాళీ చేయించారు. జిమ్‌ వస్తువులు, బాక్సింగ్‌కు అవసరమైన పరికరాలను జెడ్పీ స్కూల్‌ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మజీద్‌వాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని గదుల్లోకి మార్చారు. శిక్షణ సామగ్రిని అక్కడి నుంచి తీసుకొచ్చి తీసుకెళ్లి భద్రపర్చడం ఇబ్బందిగా మారింది. 40మంది క్రీడాకారులు నిత్యం సాధన చేస్తుండగా.. రెండున్నరేళ్లలో 20మంది జాతీయ స్థాయి బాక్సింగ్‌ పోటీల్లో గుర్తింపు పొందారు. సౌత్‌ నేషనల్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో రెండు సిల్వర్‌ పతకాలు సాధించారు. 32మంది రాష్ట్ర స్థాయిలో 106సార్లు పాల్గొని 80 పతకాలు గెలుచుకున్నారు. ఇంతటి విజయాలు నమోదు చేస్తున్నా సరైన సౌకర్యాలు లేవు. స్టేడియం నిర్మాణంతోనే పూర్తి స్థాయి వసతులు ఏర్పడుతాయి. 12 ఎకరాల్లో స్టేడియం నిర్మాణం పూర్తి చేస్తే అథ్లెటిక్స్‌ కోసం సింథటిక్‌ ట్రాక్‌, వాలీబాల్‌, హ్యాండ్‌బాల్‌ కోర్టులు, ఇతర క్రీడల కోసం అవసరమైన ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement