ఉపాధి వేట నుంచి వ్యాపార వేదికపైకి.. | - | Sakshi
Sakshi News home page

ఉపాధి వేట నుంచి వ్యాపార వేదికపైకి..

Jul 5 2026 11:22 PM | Updated on Jul 5 2026 11:22 PM

ఐటీడీఏ గురుకుల టెండర్లలో గిరిజన నిరుద్యోగులు ఉమ్మడి జిల్లా నుంచి 10 మంది ఎంపిక ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగుల్లో నూతన ఉత్సాహం

ఉట్నూర్‌రూరల్‌:ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన నిరుద్యోగ యువత ఉపాధి, చిన్న ఉద్యోగాల కోసం ఐటీడీఏ కార్యాలయం చుట్టూ తిరిగేవారు సాధారణంగా కనిపిస్తారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గతంలో ఉద్యోగాల కోసం అర్జీలు పట్టుకుని తిరిగిన చేతులే ఇప్పుడు టెండర్ల బరిలో నిలిచి కాంట్రాక్టులు దక్కించుకుంటున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఉన్న 28 గిరిజన గురుకుల విద్యా సంస్థలకు సంబంధించిన టెండర్లు ఇటీవల నిర్వహించారు. ఇందులో గిరిజన యువత సానిటేషన్‌, క్యాటరింగ్‌, పండ్లు, కూరగాయల సరఫరా విభాగాల్లో పలు టెండర్లు దక్కించుకున్నారు.

పీవో ప్రత్యేక చొరవ..

ఐటీడీఏ పరిధిలోని గురుకుల విద్యా సంస్థల్లో చికెన్‌, మటన్‌, పండ్లు, కూరగాయల సరఫరాతోపాటు శానిటేషన్‌, క్యాటరింగ్‌ విభాగాల ఇటీవల టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. ఎప్పుడూ మైదాన ప్రాంతాల వ్యాపారులకే దక్కే ఈ టెండర్లలో స్థానిక గిరిజన, ఆదివాసీ నిరుద్యోగ యువతకు కూడా భాగస్వామ్యం కల్పించాలని ఏజెన్సీ నిరుద్యోగులు ఐటీడీఏ పీవో మంద మకరందును కోరారు. పీవోను కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. యువత విజ్ఞప్తిని సానుకూలంగా స్వీకరించిన పీవో, టెండర్ల ప్రక్రియలో గిరిజనులకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించేలా చర్యలు తీసుకున్నారు. పీవో ఆదేశాల మేరకు ఐటీడీఏ డీడీ ప్రేమకళ, గురుకుల ఆర్సీవో అనిల్‌ కాంబ్లే, జీసీసీ డీఎం సందీప్‌తో కూడిన ప్రత్యేక కమిటీ గిరిజన యువతను ధైర్యంగా ముందుకు రావడానికి ప్రోత్సహించింది. ఈ చొరవతో మొత్తం 28 గురుకులాల టెండర్లలో 10 మంది నిరుద్యోగ గిరిజన యువతి, యువకులు సానిటేషన్‌, క్యాటరింగ్‌, పండ్లు, కూరగాయల టెండర్లను సొంతం చేసుకున్నారు.

పీవోకు ప్రత్యేక కృతజ్ఞతలు

తమ సమస్యను ఆలకించి వ్యాపార రంగంలో అడుగుపెట్టేలా చేసిన పీవో మంద మకరందుకు, ఐటీడీఏ అధికారులకు కృతజ్ఞతలు. తమ సొంత ప్రాంత పిల్లలు చదువుకునే గురుకులాలకు పరిశుభ్రత విభాగంతోపాటు అత్యంత నాణ్యమైన ఆహార పదార్థాలు సరఫరా చేస్తాం. అధికారులు మాపై ఉంచిన నమ్మకాన్ని వంద శాతం నిలబెట్టుకుంటాం.

– సోమేశ్‌, గిరిజన యువకుడు

ఉపాధిని మెరుగుపరుచుకోవాలి

గిరిజన యువత కేవలం ఉద్యోగాలపైనే ఆధారపడకుండా ఇలా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం శుభపరిణామం. పీవో చొరవతో గిరిజన నిరుద్యోగ యువతకు లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మున్ముందు వ్యాపార రంగంలో మరిన్ని విజయాలు సాధించి స్థానికంగా మరింతమందికి ఉపాధి కల్పించాలి.

– సందీప్‌, జీసీసీ డీఎం ఉట్నూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement