మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇంటికి.. వేసవిలో చిన్నారులపై పర్యవేక్షణ అవసరం జాగ్రత్త వహించాలంటున్న వైద్యనిపుణులు
నిర్మల్‌ఖిల్లా/మంచిర్యాలఅర్బన్: ప్రస్తుత వేసవికాలంలో రోజురోజుకూ ఎండలు ముదురుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పాఠశాలలు నడపాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. తరగతులు ముగిశాక విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టించి ఇంటికి పంపనున్నారు. పదోతరగతి పరీక్ష కేంద్రాలు ఉన్నచోట మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు కొనసాగనున్నాయి. ఈ సమయంలో విద్యార్థులు ఎండబారిన పడకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
జాగ్రత్తలు అవసరం
వేసవిలో సరైన మోతాదులో నీరు తాగకపోతే తల తిరగడం, వాంతులు, అలసట వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. చిన్నారులు తరచూ నీరుతాగడం, తేలికపాటి ఆహా రం తీసుకోవడం అలవాటు చేయాలని సూచిస్తున్నారు. తల్లిదండ్రులు వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లే సందర్భాల్లో పిల్లలపై పర్యవేక్షణ త గ్గే అవకాశముండటంతో మరింత జాగ్రత్త అవసరమని పేర్కొంటున్నారు. విద్యార్థుల తలకు రుమాలు, టోపీ లేదా గొడుగు వాడేలా చూడాలని చెబు తున్నారు. మధ్యాహ్నం బడి ముగియడంతో పిల్ల లు వాగులు, చెరువులు, వ్యవసాయ బావుల్లో స్నా నాలు చేసేందుకు పంపించొద్దని పేర్కొంటున్నారు.
చదువులకు వినియోగించుకోవాలి
మధ్యాహ్నం తర్వాత పిల్లలు ఖాళీగా ఉండే సమయాన్ని చదువులకు వినియోగించుకోవాలి. హోంవర్క్ చేయించడం, పరీక్షలకు సిద్ధం చేయడంతోపాటు క్రాఫ్ట్ పనులు, డ్రాయింగ్, పెయింటింగ్ నేర్చుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇండోర్ గేమ్స్, పజిల్స్ వంటి మేధస్సును పెంపొందించే ఆటలపై ఆసక్తి పెంచాలని సూచిస్తున్నారు. మొబైల్ ఫోన్ల వినియోగాన్ని పరిమితం చేసి కథల పుస్తకాలు చదివే అలవాటు పెంచాలని చెబుతున్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల వివరాలు
జిల్లా సంఖ్య
నిర్మల్ 1,049
ఆదిలాబాద్ 1,449
మంచిర్యాల 1,051
కుమరంభీమ్ 1,204
మొత్తం 4,753
మొత్తం విద్యార్థులు: సుమారు 5.12 లక్షలు


