బాసర: బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారిని ఆదివారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధానార్చకులు సంజీ పూజారి ఆయన్ను సత్కరించి ఆశీర్వచనం అందించారు. ఆలయ ఈవో విజయ రామారావు, తహసీల్దార్ పవన్ చంద్ర, ఏఈఓ శ్రీనివాస్, ఎస్‌హెచ్‌వో కిరణ్, ఎస్సై నవనీత్రెడ్డి, ఆలయ పీఆర్వో రామారావు, సిబ్బంది ఉన్నారు.
ఇసుక తరలిస్తున్న వాహనాలు పట్టివేత
బాసర: బాసరలో ఆదివారం రెండు లారీలు, ఐచర్ వాహనాల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో బాసర చెక్‌పోస్ట్ నాయగావ్ వెళ్లే రూట్ వద్ద ఎస్‌హెచ్‌ఓ సీఐ కిరణ్ ఆధ్వర్యంలో వాహనాలను పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో సీఐ కిరణ్ తెలిపారు.
లోకేశ్వరం: మండలంలోని సాథ్‌గాం శివారు ప్రాంతం సుద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను ఆదివారం పట్టుకున్నట్లు జీపీవో భీమేశ్ తెలిపారు. ఇసుకను ట్రాక్టర్‌లో ధర్మోర వైపు తరలిస్తుండగా మండల కేంద్రంలో పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
మహిళా రైతు కూలీ మృతి
చెన్నూర్: పొలం వద్ద పనిచేస్తుండగా రైతు కూలీ ఆదివారం మృతిచెందింది. ఎస్సై రాజశేఖర్ కథనం ప్రకారం.. జైపూర్ మండలం పౌనూర్‌కి చెందిన అఖిల(27) అదే గ్రామానికి చెందిన మేడగోని శ్యామ్‌కుమార్‌తో 2024లో వివాహామైంది. ఉదయం గ్రామ శివారులో వరిలో కలుపు తీయడానికి కూలీ పనిగా వెళ్లింది. అక్కడ పని చేస్తుండగా ఒడ్డు మీద కరెంట్ బోరు మోటారు నీళ్లు పోసే ఇనుప పైపు తాకి ఆకస్మాతుగా పడిపోయి స్పృహా కోల్పోయింది. గమనించిన తోటి కూలీలు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలు అఖిలకు విద్యుత్ షాక్ తగిలిందా, మరేదైనా వేరే కారణంతో చనిపోయిందా అనేది సమగ్ర విచారణ చేయాలని తండ్రి కొమురయ్య కోరాడు. ఈమేరకు తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


