నేడు పవిత్ర షబ్బెఖదర్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు పవిత్ర షబ్బెఖదర్‌

Mar 16 2026 7:53 AM | Updated on Mar 16 2026 7:53 AM

● ఖురాన్‌ అవతరణ దినోత్సవం

నెన్నెల: ముస్లింల పవిత్రమాసం రంజాన్‌ నెలలో 26వ రోజున అల్లా అంతిమ దైవగ్రంథం దివ్య ఖురాన్‌ అవతరించింది. రంజాన్‌ నెల ప్రారంభమై సోమవారానికి 26వ రోజు, ఈరోజే అవతరించింది. దీన్నే షబ్బెఖదర్‌గా పిలుస్తారు. ఆధ్యాత్మిక బోధనలతో ఈ మహాగ్రంథం మార్గనిర్దేశం చేస్తుందని నెన్నెల జామా మసీదు మౌలానా షగీర్‌ అహ్మద్‌ బర్కద్‌వా చెప్పారు. ఖురాన్‌ సన్మార్గ బాటలో పయనించడానికి ఉపకరిస్తుందని వివరించారు. ఖురాన్‌ మహాగ్రంఽథాన్ని కంఠస్తం చేసేవారి సంఖ్య భారీగా ఉండటం దైవ సంకల్పానికి నిదర్శమన్నారు. చరిత్ర పుటల్లో ఖురాన్‌ అవతరించి సుమారు 1450 ఏళ్లు దాటుతున్నా అక్షరం కూడా మార్పు చెందలేదన్నారు. ఖురాన్‌లో 30 ఫారాలు(పాఠాలు), 114 సూరాలు, 6666 వాక్యాలు ఉన్నాయని చెప్పారు.

అశాంతి రాజ్యమేలిన నేపథ్యం..

అరబ్బుల హయాంలో అశాంతి రాజ్యమేలిన నేపథ్యమే దివ్య ఖురాన్‌ అవతరణకు మూలమని మౌ లానా షగీర్‌ అహ్మద్‌ బర్కద్‌వా తెలిపారు. అప్పట్లో ఒకరి హక్కులు మరొకరు కాలరాస్తూ పరస్పరం దూషించుకుంటూ దాడులకు పాల్పడుతూ గడిపేవారని వివరించారు. మహ్మద్‌ ప్రవక్త చలించిపోయి మానసిక ఉపశమనం కోసం ‘ఘారెహిర’అనే గుహలో ఒంటరిగా కూర్చొని అల్లాను స్మరించుకునేవారని, ఒకరోజు అల్లాహ్‌ తన దూత జిబ్రాయిల్‌ ద్వారా మహ్మద్‌ ప్రవక్తకు చేరవేసిన సందేశం చదివి ప్రవక్త మనస్సు ఆలోచనతో ప్రపంచ గమనాన్ని చుట్టి వచ్చిందన్నారు. ఆ సందేశాలకు విస్తృత ప్రచారం కలిగిస్తే ప్రజలకు చెడు నుంచి విముక్తి కలిగించి సన్మార్గంలో నడపొచ్చని ఆయన ప్రగాఢంగా విశ్వసించారని చెప్పారు. వాటి నుంచి అల్లాహ్‌ తన సందేశం వినిపించేవారని, అలా నలభయ్యే ఏటా నుంచి దశలవారీగా 30 ఏళ్ల పాటు అల్లాహ్‌ అందించిన భిన్న సందేశాల సమూహారమే ఖురాన్‌ మహాగ్రంథం. ప్రతి ముస్లిం విధిగా వజూ చేసి ఆపై ఖురాన్‌ చేత పట్టుకొని ఖిబ్లా(పడమర) వైపు తిరిగి దైవనామ స్మరణతో చదవాలని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement