కడెం: మండలంలోని కల్లెడలో క్రీస్తుశకం పదో శతా బ్దానికి చెందిన ఓ పురాతన ఆలయ స్తంభాలను గుర్తించినట్లు ప్రముఖ చరిత్ర పరిశోధకుడు కరిపె రాజ్‌కుమార్ తెలిపారు. మల్లన్న దేవుని మందిరంలో అద్భుతంగా తీర్చిదిద్దిన రెండు రాతి స్తంభాలు, ఆలయ ప్రాంగణంలో ఒక రాతి దూలాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. రెండు ఎత్తైన, వెడల్పైన, దృఢమైన రాతి ద్వారాల శేరెలపై అందంగా చెక్కిన శైవ ద్వార పాలకులున్నట్లు, ఒక్కొక్క ద్వార పాలకునికి సేవకోసం ఒక్కో చామరధారిణిని చెక్కిన శిల్పాలు రమణీయంగా ఉన్నట్లు తెలిపారు. అవి చాళుక్య శైలికి చెందిన శిల్పాలని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో వెయ్యేళ్ల క్రితం చాళుక్యుల పరిపాలన అనేక ఏళ్లు వర్థిల్లిందని ఆయన తెలిపారు. అక్కడ పూర్వం విశాలమైన ఆలయం ఉండేదని తెలుస్తోందని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీ రామోజు హరగోపాల్ విశ్లేషించారు. ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.


