స్కూల్ బస్సు ఢీ.. ఒకరికి గాయాలు
తాండూర్: మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు శుక్రవారం పిల్లలను తీసుకెళ్తూ మండల కేంద్రంలో తాండూర్‌కు చెందిన మనోహర్ అనే వ్యక్తిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు అతడిని హుటాహుటిన 108 వాహనంలో బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా సదరు పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యపు వ్యవహరం వివాదాస్పదమవుతోంది. పాఠశాల నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఈ పాఠశాల స్కూల్ బస్సు డ్రైవర్ అతిగా మద్యం సేవించి విద్యార్థులను తీసుకెళ్తూ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు చిక్కాడు. ఏడాది క్రితం ఇదే పాఠశాలకు చెందిన బస్సు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. కాగా ఈ పాఠశాలకు చెందిన కొన్ని బస్సులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా సదరు పాఠశాల యాజమాన్యం విద్యార్థుల రక్షణ పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


