పుష్కరం పనులకు వేళాయె!
వచ్చే ఏడాది జూన్, జూలై మధ్య గోదావరి పుష్కరాలు నదీతీరాలకు లక్షలాదిగా తరలిరానున్న భక్తులు ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో కసరత్తు షురూ ‘సమగ్ర రూట్ మ్యాప్’తోనే సౌకర్యాల మెరుగు
ముల్కల్ల పుష్కర ఘాట్ వద్ద భక్తుల స్నానాలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గోదావరి నది పుష్కరాల పనుల శ్రీకారానికి వేళయింది. వచ్చే ఏడాది జూన్ 26నుంచి జూలై 7వరకు జరిగే పుష్కరాల కోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభమైంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో పనుల నిర్వహణ కోసం టెండరు పిలిచి పనులు పూర్తి చేసేందుకు రంగం సిద్ధమైంది. చివరిగా గోదావరి పుష్కరాలు 2015 జూలై 14నుంచి 25వరకు జరిగాయి. ఆ సమయంలో లక్షలాదిగా ప్రజలు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రతీ పన్నెండేళ్లకోసారి వైభవంగా జరిగే పుష్కరాలు దక్షిణాదిలో ఓ కుంభమేళా తరహాలో జరుగుతాయి. జిల్లాకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. ఆ మేరకు వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జిల్లాలోనూ గత నెలలో ‘ఈవై’ కన్సల్టెన్సీ సంస్థ క్షేత్రస్థాయిలో ప్రాథమిక సర్వే చేసింది. గత నెలలో జిల్లాలో ఓ బృందం ఇక్కడి ఘాట్లను పరిశీలించింది. స్థానికంగా ఉన్న పరిస్థితులను అంచనా వేసి ఎలాంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉందనే అంశంపై అధ్యయనం చేసింది.
పుణ్యస్నానాలు, పుణ్యక్షేత్రాలు
జిల్లాలో గోదావరి నది వంద కిలోమీటర్లపైనే పట్టణాలు, గ్రామాల సరిహద్దుల గుండా ప్రవహిస్తోంది. నదీ తీరం వెంట రోడ్లు, ఆధ్యాత్మిక, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. భక్తులు అధికంగా పుణ్యస్నానాలు ఆచరించే గోదావరి తీర ప్రాంతాలైన దండేపల్లి మండలం ద్వారక, గూడెంగుట్ట, లక్సెట్టిపేట, ముల్కల్ల, మంచిర్యాల నగరం, సీతారాంపల్లి, జైపూర్ మండలం వేలాల, చెన్నూర్ సమీపంలో గోదావరి తీరం వెంట పుష్కర ఘాట్లు ఉన్నాయి. ఇప్పుడవి చాలాచోట్ల పాడైపోయాయి. ఇవేకాకుండా కొన్ని చోట్ల భక్తులు గోదావరి తీరం వెంట తమకు వీలున్న చోట్ల నదీ స్నానాలకు వెళ్తుంటారు. జిల్లాలో గోదావరి తీరం వెంట ఆధ్యాత్మిక కేంద్రాలు, దేవస్థానాలు ఉన్నాయి. దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి గుడి, గోదావరిలోనే ఉన్న ద్వారక, జైపూర్ మండలం వేలాల మల్లన్న, చెన్నూర్‌లో ఉత్తర వాహినిగా తూర్పు వైపు ప్రవాహం అత్యంత ప్రాశస్త్యం పొందింది. దీంతో పుణ్యస్నానాలతో ఆయా ఆలయాలకు వేలాదిగా వచ్చే అవకాశాలున్నాయి. ముల్కల్ల తీరంలో వెలిసిన స్వయంభూ విజయదుర్గ ఆలయం తదితర ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలను కలుపుతూ పుష్కర పనులపై ఓ రూట్‌మ్యాప్ రూపొందించాల్సి ఉంది.
అధికారులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు
జిల్లాలో గోదావరి పుష్కరాలపై అధికారులతో జిల్లా స్థాయిలో ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. మున్సిపల్, పంచాయతీ, రెవెన్యూ, పోలీసు, దేవాదాయ, నీటి సరఫరా శాఖ, రోడ్లు భవనాలు, వైద్యారోగ్య, విద్యుత్ తదితర విభాగాల అధికారులు, జిల్లా అధికారులతో కలెక్టర్ కుమార్ దీపక్ నేతృత్వంలో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. త్వరలో మొదలు కాబోయే పుష్కరాల పనులపై ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు.
పుష్కరం పనులకు వేళాయె!


