నో హెల్మెట్.. బాదుడే..!
మంచిర్యాలక్రైం: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై పోలీసులు జరిమానాల కొరడా ఝళిపిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు నడిపేవారు సీటు బెల్ట్ ధరించలేదని ఎడాపెడా ఫైన్‌లు విధిస్తున్నారు. ఒక్క జిల్లా కేంద్రం మంచిర్యాల పరిధిలోనే గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు వివిధ రకాల ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన కింద 1,85,451 కేసులు నమోదు కాగా.. రూ.4,67,97,000 జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల భద్రత, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన అంటూ ఫొటోలు కొట్టడమే ట్రాఫిక్ పోలీసుల డ్యూటీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు ఖర్చు చేస్తున్న డబ్బులన్నీ వాహనాలపై జరిమానాల రూపంలో ఏడాదికి రూ.కోట్లలో రాబట్టుకుంటుందనే ఆరోపణలు వస్తున్నాయి.
ఫొటోలు.. వసూళ్లు
ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉంటుండడంతో పోలీసులు కొత్త ఎత్తుగడ అమలు చేస్తున్నారు. కొందరు నిబంధనల ఉల్లంఘనలపై ఫొటోలు తీస్తుండగా.. మరికొందరు వాహనాలు ఆపి మరీ పెండింగ్‌లో ఉన్న ఈ–చలాన్లు కట్టించే పనిలో నిమగ్నమయ్యారు. గతంలో రెండుసార్లు ప్రభుత్వం వాహనాల పెండింగ్ చలాన్లపై భారీగా రాయితీ ఇచ్చింది. సుమారు 70శాతం రికవరీ అయ్యాయి. ప్రస్తుతం వాహనదారులు ప్రభుత్వం మళ్లీ రాయితీ ఇస్తుందని, అప్పుడు చెల్లించుదామనే ధోరణిలో ఉన్నారు.
జరిమానాలు మా లక్ష్యం కాదు
వాహనాదారుల్లో మార్పు కోసమే జరిమానాలు విధిస్తున్నాం. జరిమానాలు విధించడం పోలీసుల లక్ష్యం కాదు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రజల ప్రాణా లు కాపాడిన వారమవుతాం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధిస్తున్నాం.
– సత్యనారాయణ, ట్రాఫిక్ సీఐ, మంచిర్యాల
జిల్లా కేంద్రంలో గతేడాది నమోదైన కేసులు
ఉల్లంఘనలు కేసులు జరిమానా
(రూ.లలో)
సెల్‌ఫోన్ డ్రైవింగ్ 1936 19,36,000
మైనర్ డ్రైవింగ్ 44 22,000
ఓవర్ స్పీడ్ 6174 61,74,000
ట్రిపుల్ రైడింగ్ 2271 27,25,200
నంబర్ ప్లేట్ లేనివి 596 1,19,200
హెల్మెట్ లేనివి 1,69,315 32,04,2900
రాంగ్ రూట్ డ్రైవింగ్ 3681 37,77,700
నో హెల్మెట్.. బాదుడే..!


