మంత్రిని కలిసిన రోడ్డు విస్తరణ బాధితులు
చెన్నూర్: చెన్నూర్ అంబేద్కర్ చౌరస్తా పెద్ద చెరువుకట్ట వరకు రోడ్డు విస్తరణ బాధితులు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని శుక్రవారం హైదరాబాద్‌లో మాజీ జెడ్పీటీసీ పోటు రాంరెడ్డి ఆధ్వర్యంలో కలిశారు. రోడ్డు విస్తరణలో 60 ఫీట్లు కాకుండా 40 ఫీట్లు వెడల్పు చేయాలని విన్నవించారు. 60 ఫీట్ల రోడ్డు వెడల్పుతో 20 నుంచి 30 కుటుంబాటు రోడ్డున పడే అవకాశం ఉందని, వెసులుబాటు కల్పించాలని కోరారు. మంత్రి స్పందిస్తూ రోడ్డు విస్తరణలో పూర్తిగా భవనాలు కోల్పోయిన వారికి మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్మించే కమర్షియల్ కాంప్లెక్స్‌లో ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఈ నెల 6న చెన్నూర్‌కు వచ్చిన తర్వాత మాట్లాడుకుందామని తెలిపారు. కార్యక్రమంలో సామాజిక వేత్త పోటు సత్యనారాయణరెడ్డి, రోడ్డు విస్తరణ బాధితులు పాల్గొన్నారు.


