‘సంక్రాంతి’కి ప్రత్యేక బస్సులు
మంచిర్యాలఅర్బన్: సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. పండుగ వేళ ఆంధ్రా ప్రాంతానికి నెల రోజుల ముందు నుంచే ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ ప్రకటించింది. ఈ ఏడాది ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి కాగజ్‌నగర్ వైపు ప్రత్యేక రైళ్లు ప్రకటించకపోవడంతో బస్సులకు ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండనుంది. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య రెట్టింపైంది. పండుగ రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేస్తోంది. సెలవులు కూడా వస్తుండడంతో పండుగ సందడి మొదలు కానుంది. గత ఏడాది సంక్రాంతికి మంచిర్యాల ఆర్టీసీ డిపో నుంచి 81 బస్సులు నడిపించారు. ఈ ఏడాది ప్రయాణికుల రద్దీ, సౌకర్యార్థం 101 ప్రత్యేక బస్సులు నడిపించనున్నారు. సంక్రాంతి పండుగకు ముందు రోజు 17నుంచి 20 బస్సులు నడిపించనున్నారు. మంచిర్యాల–సికింద్రాబాద్–మంచిర్యాలకు ఈ నెల 7న 5బస్సులు, 8న 6, 9న 21, 10న 20, 11న 8, 12న 17, 13న 20, 14న నాలుగు బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. జేబీఎస్‌లో ప్రయాణికులకు బస్సుల సమాచారం ఎప్పటికప్పుడు అందించేందుకు మేనేజర్, అసిస్టెంటు మేనేజర్, సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు.
నేటి నుంచి మేడారానికి..
మంచిర్యాల నుంచి మేడారం జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆదివారం నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. ఉదయం 6గంటలకు బస్సు బయలుదేరి చెన్నూర్, కాళేశ్వరం మీదుగా మేడారం చేరుకుంటుంది. మధ్యాహ్నం 1గంటకు తిరుగు ప్రయాణంలో మంథని, గోదావరిఖని మీదుగా మంచిర్యాలకు చేరుతుంది. రద్దీకి అనుగుణంగా బస్సులు నడపనున్నారు.
రద్దీకి అనుగుణంగా నడిపిస్తాం..
పండుగ సందర్భంగా రద్దీ అధికంగా ఉంటే మరిన్ని ప్రత్యేక బస్సులు నడిపే అవకాశం ఉంది. ప్రత్యేక బస్సుల్లో రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది. సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలి. ఆయా బస్‌స్టేషన్‌లో సమాచారం అందించేలా సిబ్బందిని అందుబాటులో ఉంచాం.
– శ్రీనివాసులు, డిపో మేనేజర్, మంచిర్యాల


