● బాయిల్డ్‌ మాత్రమే ఇస్తామంటూ మిల్లర్ల పట్టు ● యాసంగి ధాన్యం సేకరణపై తర్జనభర్జన ● ఈ నెల చివరలో కొనుగోళ్లకు సన్నాహాలు | - | Sakshi
Sakshi News home page

● బాయిల్డ్‌ మాత్రమే ఇస్తామంటూ మిల్లర్ల పట్టు ● యాసంగి ధాన్యం సేకరణపై తర్జనభర్జన ● ఈ నెల చివరలో కొనుగోళ్లకు సన్నాహాలు

Apr 3 2026 8:02 AM | Updated on Apr 3 2026 8:02 AM

● బాయిల్డ్‌ మాత్రమే ఇస్తామంటూ మిల్లర్ల పట్టు ● యాసంగి ధాన్యం సేకరణపై తర్జనభర్జన ● ఈ నెల చివరలో కొనుగోళ్లకు సన్నాహాలు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: యాసంగి(రబీ) ధాన్యం కొనుగోళ్లకు తిప్పలు తప్పేలా లేవు. వేసవిలో దొడ్డు ధాన్యం మిల్లింగ్‌ చేస్తే నూక అధికంగా అవుతాయి. ఈ క్రమంలో రా రైస్‌(ముడి బియ్యం) ఇవ్వడంలో మిల్లర్లకు నష్టం వస్తుంది. దీంతో బాయిల్డ్‌ బియ్యం మాత్రమే పౌరసరఫరాల శాఖకు అప్పగిస్తామని జిల్లా మిల్లర్ల సంఘం అధికారులకు విన్నవించింది. తమకు బాయిల్డ్‌ మాత్రమే ఇవ్వాలని మిల్లర్లు కోరుతుంటే.. ప్రభుత్వం మాత్రం రా రైస్‌ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) రా రైస్‌ మాత్రమే తీసుకుంటామని తేల్చిచెప్పింది. దీంతో ధాన్యం కొనుగోళ్లు ఎలా సాగుతాయనే తర్జనభర్జన మొదలైంది. జిల్లాలో మరో రెండు వారాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో వరి నాట్లు ఆలస్యం కావడంతో ఇతర జిల్లాలో పోలిస్తే దిగుబడిలో కొంత జాప్యం జరుగుతుంది. కొనుగోళ్లపై స్పష్టత రాకపోతే ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై పౌరసరఫరాల శాఖ అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఈ మేరకు మిల్లర్లతో జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడంతో ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.

సేకరణ 2లక్షల మెట్రిక్‌ టన్నులకుపైనే..

జిల్లాలో గత రెండేళ్లుగా యాసంగిలో రెండు లక్షల మెట్రిక్‌ టన్నులకు పైనే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. గత సీజన్‌ యాసంగి చూస్తే జిల్లాలో 18మిల్లులకే ధాన్యం ట్యాగింగ్‌ ఇచ్చారు. మిగతాది పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాల్లోని 56 మిల్లులకు తరలించారు. మొత్తంగా రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు. ఈసారి సైతం రెండు లక్షల మెట్రిక్‌ టన్నులపైనే ధాన్యం సేకరణ లక్ష్యం ఉంటుందనే అంచనా ఉంది. ఈ క్రమంలో ధాన్యం కొనుగోళ్లు ఎలా జరుగుతాయనేది పెద్ద సమస్యగా మారింది. మిల్లర్లు రా రైస్‌ ఇవ్వలేమని, బాయిల్డ్‌ మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. మరోవైపు జిల్లాలో టెండర్‌ ధాన్యంతో సహా పలు సీజన్ల సీఎంఆర్‌(కస్టం మిల్డ్‌ రైస్‌) బకాయిలతో చాలా వరకు బ్లాక్‌ లిస్టులో ఉన్నాయి. మిల్లర్లపై ఆర్‌ఆర్‌, క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ఉన్నవాటిలో బ్యాంకు గ్యారంటీలు ఇవ్వలేక వానాకాలంలోనే తిప్పలు పడ్డారు. పొరుగు జిల్లాల మిల్లర్లు సైతం ధాన్యం తీసుకునేందుకు మొగ్గు చూపడం లేదు. ఈ క్రమంలో యాసంగి ధాన్యం సేకరణపై స్పష్టత రావడం లేదు.

జిల్లాలో యాసంగి వరి సాగు

1,22,037 ఎకరాలు

ధాన్యం సేకరణ లక్ష్యం

2.81లక్షల మెట్రిక్‌ టన్నులు(అంచనా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement