పునర్విభజనలో ‘నియోజకవర్గం’పై ఆశలు
సాధన కోసం కమిటీ ఏర్పాటుకు సమావేశం
14మంది ఎమ్మెల్యేలు ఇక్కడి నుంచే..
పాత నియోజకవర్గ కేంద్రంగా పేరు
లక్సెట్టిపేట: నిజాం కాలం నుంచి లక్సెట్టిపేట పట్టణానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఉమ్మడి జిల్లాలోనూ లక్సెట్టిపేట నియోజకవర్గం రాజకీయంగా ప్రత్యేకతను సంతరించుకుంది. 1952 నుంచి 2004 వరకు లక్సెట్టిపేట శాసనసభ నియోజకవర్గం నుంచి 14 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించగా.. రాజకీయంగా ఎన్నికల చరిత్రలో నిలిచిపోయింది. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనతో 2009 నుంచి మంచిర్యాలను నియోజకవర్గంగా ప్రకటించడంతో ప్రాధాన్యత కోల్పోతూ వచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో లక్సెట్టిపేట తాలూకాను నియోజకవర్గంగా అప్ప ట్లో ప్రకటించారు. ద్విసభ నియోజకవర్గంగా ఏర్పడడంతో ఇక్కడి నుంచి ఇద్దరు ఎమ్మెల్యే ప్రాతిని ధ్యం వహించారు. పునర్విభజనలో మంచిర్యాల నియోజకవర్గ కేంద్రంగా ఏర్పడడం, లక్సెట్టిపేట పట్టణం అందులో కొనసాగుతుండడం తెలిసిందే. తాజాగా నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో లక్సెట్టిపేట నియోజకవర్గం ఏర్పాటు చేయాలనే డిమాండ్ స్థానికుల నుంచి వ్యక్తమవుతోంది. జన్నా రం మండలం ఖానాపూర్ నియోజకవర్గంలో ఉండడంతో అక్కడి ప్రజలు దూరభారంతో ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలోని దండేపల్లి మండలం కూడా దూరంగా ఉందని, అభివృద్ధి జరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. జన్నారం, దండేపల్లి, హాజీపూర్, లక్సెట్టిపేట మండలాలను కలుపుతూ లక్సెట్టిపేట శాసనసభ నియోజకవర్గం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. నియోజకవర్గం ఏర్పాటు చేయాలంటే కనీసం లక్షా 30వేల మంది ఓటర్లు ఉండాల్సి ఉంటుంది. లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం, హాజీపూర్ మండలాల జనాభా సుమారు రెండు లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణవాసులు, అఖిలపక్ష పార్టీల నాయకులు గత నెల 30న లక్సెట్టిపేట ఐబీ ఆవరణలో సమావేశం అయ్యారు. నియోజకవర్గ సాధన కోసం కమిటీ ఏర్పాటు చేసి పోరాటం చేయాలని నిర్ణయించారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. నియోజకవర్గం సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.


