మంచిర్యాలరూరల్(హాజీపూర్): మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల ప్రచార వ్యయం వివరాలు అప్పగించడానికి గడువు ముగిసింది. నిబంధనల మేరకు సోమవారం వరకే వివరాలు అప్పగించాల్సి ఉంది. గెలిచిన వాళ్లు మినహా ఓడిన అభ్యర్థులు చాలా వరకు లెక్కలు అప్పగించలేదు. ప్రచార వ్యయం వివరాలు సమర్పించని అభ్యర్థులు వచ్చే మూడేళ్లలో ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా అనర్హత వేటు పడే అవకాశం ఉంది. జిల్లాలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు లక్సెట్టిపేట, చెన్నూర్, క్యాతనపల్లి, బెల్లంపల్లి మున్సిపాల్టీలు ఉన్నాయి. ఆయా బల్దియాల్లోని 149 డివిజన్లు, వార్డుల్లో మొత్తంగా 692 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. ఫలితాలు వెలువడిన రోజు నుంచి 45రోజుల్లో ఎన్నికల ప్రచార వ్యయం వివరాలు అప్పగించాల్సి ఉంటుంది. అభ్యర్థుల్లో 504 మంది లెక్కలు అప్పగించగా.. ఇంకా 188 మంది అప్పగించలేదు. వీరిపై ఎన్నికల సంఘం పోటీకి అనర్హత వేటు వేసే అవకాశం ఉంది.
భారీగా వ్యయం..
వివిధ పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులూ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ నమూనా పత్రాల ముద్రణ, వాల్‌పోస్టర్లు, ఫ్లెక్సీల ఏర్పాటు, ప్రచార ర్యాలీ, టిఫిన్లు, భోజనాలు, కార్యకర్తల ఖర్చుల వివరాలు, ప్రచారం కోసం వినియోగించిన వాహనాల డీజిల్, డ్రైవర్ ఏర్పాటు ఖర్చులు, ఇతర పోలింగ్ ఖర్చుల వివరాలన్నీ లిఖిత పూర్వకంగా అందించాలి. గెలుపోటములతో సంబంధం లేకుండా నామినేషన్ల నుంచి మొదలు ప్రచారం ముగిసే వరకు లెక్కలు ఇవ్వాలి. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు గెలువాలనే తపనతో రూ.లక్షలు దాటి రూ.కోటి వరకు ఖర్చు చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక్కో కార్పొరేటర్ రూ.1.50లక్షలు, కౌన్సిలర్ అభ్యర్థి రూ.లక్ష వరకు ప్రచారానికి ఖర్చు చేయవచ్చు. కానీ పరిమితి మించి ఖర్చు చేశారు. అభ్యర్థులు పరిమితికి మించకుండా ప్రచార వ్యయం లెక్కలు చూపించినట్లు సమాచారం.
పోటీ చేసిన అభ్యర్థుల వివరాలు..
మున్సిపాలిటీ వార్డులు/ డివిజన్‌లు అభ్యర్థులు
మంచిర్యాల 60 240
బెల్లంపల్లి 34 172
చెన్నూర్ 18 107
క్యాతనపల్లి 22 113
లక్సెట్టిపేట 15 60
మొత్తం 149 692


