వార్షిక రుణ లక్ష్యాలు సాధించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లా వార్షిక రుణ లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేలా బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతి, ఆర్బీఐ ఏజీఎం చేతన్, తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజనల్ మేనేజర్ ప్రశాంత్, ఎస్‌బీఐ రీజనల్ మేనేజర్ సురేష్‌తో కలిసి రుణ లక్ష్యసాధనపై సమీక్ష నిర్వహించారు. సె ప్టెంబర్ 2025 వరకు పంట రుణాలకు రూ.2,541 కోట్ల లక్ష్యం కాగా రూ.1,045 కోట్లు, వ్యవసాయ దీర్ఘకాలిక రుణాలు రూ.922 కోట్లకు గాను రూ.323 మంజూరు చేసినట్లు తెలిపారు. వ్యవసాయ, గృహ నిర్మాణం, ప్రాధాన్యత, ప్రాధాన్యేతర రంగాల రుణాలపై వివరించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.
పనులు వేగవంతం చేయండి
చెన్నూర్/చెన్నూర్‌రూరల్: చెన్నూర్‌లో వంద పడకల ఆస్పత్రి భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఆసుపత్రి నిర్మాణ పనులు, తహశీల్ కార్యాలయంలో భూభారతి పెండింగ్ దరఖాస్తులు, మండలంలోని కిష్టంపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణాలు పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున్, అధికారులు పాల్గొన్నారు.
సకల సదుపాయాలతో కూడిన విద్య
వేమనపల్లి: ప్రభుత్వ విద్యాసంస్థల్లో సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందుతోందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమోన్నత పాఠశాల, నీల్వాయి కేజీబీవీ తనిఖీ చేశారు. కేజీబీవీలో అదనపు గదుల నిర్మాణం నెల రోజుల్లో పూర్తి చేయాలన్నారు. భోజన నాణ్యత, విద్యాబోధనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓ కుమారస్వామి, సర్పంచ్ చెన్నూరి సమ్మయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాబీర్ ఆలీ, ఎస్‌ఓ మాయూరి, హెచ్‌ఎం మాధవ్, ఏఈ రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.


