సాగునీటికి ఢోకా లేదు..
దండేపల్లి: కడెం ఆయకట్టు కింద యాసంగి సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. కడెం ప్రాజెక్టుతోపాటు గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టుకు నీరందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కడెం నీటిని ఈ నెల 4న విడుదల చేయనుండగా.. గూడెం ఎత్తిపోతల నీరు సంక్రాంతి పండుగకు ముందు గానీ తర్వాత గానీ విడుదలకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుత యాసంగిలో కడెం ప్రాజెక్టు నీరు డీ–1 నుంచి డీ–28వరకు, గూడెం ఎత్తిపోతల నీరు డీ–30నుంచి 42వరకు అందించనున్నారు. కడెం ఆయకట్టు కింద ఆరుతడి పంటలకు సరిపడా సాగునీరు ఉండడంతోపాటు సాగునీటికి ఢోకాలేదు.
వరి వైపే మొగ్గు
కడెం ఆయకట్టు కింద వర్షాకాలంలో సుమారు 60వేల ఎకరాల వరకు సాగునీరందిస్తారు. యాసంగిలో సాగువిస్తీర్ణం తగ్గుతుంది. కడెం నీటిని కడెం, జన్నారం, దండేపల్లి మండలాలకు, గూడెం ఎత్తిపోతల నీటిని కడెం ఆయకట్టు పరిధిలోని దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాలకు అందిస్తారు. గూడెం ఎత్తిపోతల నీటిని దండేపల్లి మండలం తానిమడుగు వద్ద కడెం ప్రధాన కాలువ డిస్ట్రిబ్యూటరీ 30వద్ద ఎత్తిపోస్తారు. ప్రస్తుతం యాసంగి సాగుకు కడెం ప్రాజెక్టు ద్వారా ఆరుతడి పంటల కోసం డీ–1నుంచి డీ–28వరకు సుమారు 16వేల ఎకరాలకు ఆరుతడి విధానంలో సాగునీరు అందిస్తుండగా.. ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 17వేలకు పైగా ఎకరాలకు అందించనున్నారు. యాసంగిలో ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని అధికారులు సూచిస్తున్నా ప్రతియేటా చాలామంది రైతులు వరిసాగు వైపే మొగ్గు చూపుతున్నారు. కొందరు మొక్కజొన్న పంట సాగు చేస్తున్నారు. కడెం ఆయకట్టు కింద సాగునీటి విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నామని, యాసంగిలో రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని కడెం ప్రాజెక్టు డీఈ వీరన్న తెలిపారు.
ప్రాజెక్టు పేరు పూర్తిస్తాయి నీటిమట్టం ప్రస్తుత నీటిమట్టం
(టీఎంసీల్లో) (టీఎంసీల్లో)
కడెం నారాయణరెడ్డి 4.699 4.699
శ్రీపాద ఎల్లంపల్లి 20.17 19.67


