
కార్యకర్త స్థాయి నుంచే మంత్రినయ్యా
చెన్నూర్: తాను కార్యకర్త స్థాయి నుంచే మంత్రి స్థాయికి చేరుకున్నానని, చెన్నూర్‌ను పాత కొత్త అందరం కలిసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెన్నూర్‌కు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు పెద్ద ఎత్తున మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్‌ఎస్ మాజీ సర్పంచ్ సాధనబోయిన కృష్ణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజ్, మాజీ కౌన్సిలర్ తుమ్మ రమేశ్, కారెంగుల శ్రావణ్ తదితరులకు మంత్రి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంతోపాటు పార్టీ బలోపేతమే లక్ష్యంగా కృషి చేయాలని, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకే పార్టీలో చేరికలు నిర్వహించామని తెలిపారు. తనతో పని చేసిన పాత నాయకులు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడ్డదని, అందరినీ సమానంగా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై వచ్చిన వారిని పార్టీలో చేర్చుకుంటామని తెలిపారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా క్యాంప్ కార్యాలయానికి తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బెల్లంకొండ కరుణసాగర్‌రావు, పట్టణ అధ్యక్షుడు చెన్న సూర్యనారాయణ, మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఫయాజ్, నాయకులు పాల్గొన్నారు.