
సాంకేతిక అభ్యసనం విద్యార్థులకు వరం
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వం ముందు చూపుతో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ ఆధారిత అభ్యసనం కల్పించిందని, సాంకేతిక అభ్యసనం విద్యార్థులకు ఒక వరమని డీఈవో యాదయ్య అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లాలో ఎంపిక చేసిన ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు గణితం బోధించే ఉపాధ్యాయులకు సాంకేతిక అభ్యసనంపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశలవారీగా అన్ని ప్రాథమిక పాఠశాలలకు కంప్యూటర్లు అందిస్తామని, వాటి ద్వారా నాణ్యమైన బోధన, స్వీయ అభ్యసన సులభతరం అవుతుందని తెలిపారు. శిక్షణ అంశాలను ఉపాధ్యాయులకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్, క్వాలిటీ కో–ఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి, రిసోర్సు పర్సన్లు పాల్గొన్నారు.
కేజీబీవీల నిర్వహణకు ముందస్తు
బడ్జెట్ ఇవ్వాలి
మంచిర్యాలఅర్బన్: కేజీబీవీ, యూఆర్‌ఎస్‌ల నిర్వహణకు ముందస్తు బడ్జెట్ ఇవ్వాలని డీఈవో యాదయ్యకు స్పెషల్ ఆఫీసర్లు వినతిపత్రం అందజేశారు. గ్యాస్ రిఫిల్ క్రెడిట్ బేస్‌లో పంపిణీ చేయాలని, ఎస్‌వోలకు రూ.32,500 వేతనంతో చాలా ఇబ్బందిగా మారిందని, విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.30వేల నుంచి రూ.60వేల వరకు ప్రతీ పాఠశాలకు బడ్జెట్ రిలీజు చేయాలని కోరారు. కేజీబీవీల ఎస్‌వోలు ఏ.సుమలత, ఫణిబాల, మయూరి, కనకలక్ష్మీ, జె.స్వప్న, మౌనిక, రజిత, సునీత, సరిత తదితరులు పాల్గొన్నారు.