
ఎట్టకేలకు ఓరియంట్‌లో గుర్తింపు ఎన్నికలు
కాసిపేట: మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంటు కంపెనీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు ఎట్టకేలకు నగారా మోగింది. ఈ నెల 19న ఎన్నికల నిర్వహణకు ఆదిలాబాద్ డిప్యూటీ లేబర్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు 15రోజుల్లో ఎన్నికలు నిర్వహించి, ఈ నెల 20న పూర్తి వివరాలు అందించాల్సి ఉండగా.. 19న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఎన్నికలు నిర్వహించి సాయంత్రం ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్నికల్లో 257మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 266మంది జాబితా సిద్ధం చేయగా..పలువురి అభ్యంతరాల మేరకు నూతన ఉద్యోగులు తొమ్మిది మందికి ఓటు హక్కు నిరాకరించారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో పాల్గొనేందుకు ఐదు యూనియన్లు అర్హత సాధించాయి. ఈ నెల 14న మధ్యాహ్నం 12గంటల్లోపు ఆసక్తి లేని యూనియన్లు తమ అభిప్రాయం తెలియజేస్తే పోటీలో లేకుండా బ్యాలెట్ పేపర్‌పై గుర్తు తొలగిస్తామని, లేనిపక్షంలో గుర్తు కొనసాగుతుందని కార్మిక శాఖ అధికారులు ప్రకటించారు. నాలుగేళ్లుగా ఎన్నికల కోసం ఎదురు చూస్తుండగా.. ఐదు రోజుల్లోనే ఎన్నికల నిర్వహణ ముగియనుండడంతో కార్మికులు, కార్మిక సంఘాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.