
విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత
రామకృష్ణాపూర్: రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. మందమర్రి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కార్మెల్ డిగ్రీ కాలేజీ భవనాన్ని కలెక్టర్ కుమార్‌దీపక్‌తో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యాభివృద్ధే ధ్యేయంగా అనేక కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని అన్నారు. కాకా అంబేద్కర్ విద్యాసంస్థల్లో ఐదువేల మంది విద్యార్థులకు ఎలాంటి డొనేషన్లు తీసుకోకుండా విద్యనందిస్తున్నామని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో బీసీ రిజర్వేషన్లు తగ్గించారని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదం తెలిపి గవర్నర్ ద్వారా రాష్ట్రపతి వరకు పంపించి నాలుగు నెలలు గడుస్తోందని, అయినా కేంద్ర ప్రభుత్వం కావాలనే తాత్సారం చేస్తోందని అన్నారు. బీసీలపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఆర్చ్ బిషప్ కార్డినల్ ఆంథోని, ఆదిలాబాద్ బిషప్ ప్రిన్స్ ఆంథోని, బిషప్ జోసఫ కున్నత్, ఫాదర్ రెక్స్, ఫాదర్ జిజో తదితరులు పాల్గొన్నారు.