
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
● రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
మంచిర్యాలక్రైం: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నషా ముక్త్ భారత్ అభియాన్–2025 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కమిషనరేట్‌లో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పోలీస్ అధికారులు, విద్యార్థులు, వివి ధ శాఖల ఉద్యోగులు, మహిళలతో మాదక ద్రవ్య దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. గంజాయి అక్రమ రవాణా సరఫరా, సాగు చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీ ఏసీపీ మల్లారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, యాంటీ నార్కోటిక్ సీఐ రాజ్‌కుమార్, సీసీఆర్‌బీ సతీష్, పీసీఆర్ సీఐ రవీందర్, సీసీఎస్ సీఐ బాబురావ్ పాల్గొన్నారు.