
ఏసీబీ వలలో జూనియర్ అసిస్టెంటు
● డీఏ బిల్లు తయారీకి లంచం డిమాండ్ ● రూ.6వేలు తీసుకుంటుండగా పట్టివేత ● వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు
మంచిర్యాలక్రైం: డీఏ బిల్లు తయారీకి లంచం డిమాండ్ చేసిన ఆరోగ్యశాఖ జూనియర్ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు మంగళవారం వలపన్ని పట్టుకున్నారు. ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు వివరాలు వెల్లడించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గడియారం శ్రీనివాస్ కోటపల్లి మండలం అంగరాజుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇన్‌చార్జి జూనియర్ అసిస్టెంట్‌గానూ పని చేస్తున్నాడు. అంగరాజుపల్లిలోనే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌గా పని చేసిన తోట వెంకటేశ్వర్లు ఇటీవల ఉద్యోగ విరమణ పొందాడు. రెండు నెలల డీఏ బిల్లు చేసేందుకు శ్రీనివాస్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నాడు. లంచం ఇస్తే బిల్లు చేస్తానని చెప్పడంతో రూ.6వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. ఒప్పందం ప్రకారం కలెక్టరేట్‌కు సమీపంలోని ఓ హోటల్ వద్ద వెంకటేశ్వర్లు నుంచి శ్రీనివాస్ రూ.6వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కలెక్టరేట్‌లోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో పూర్తి విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఏసీబీ డీఏస్పీ మధు మాట్లాడు తూ లంచం ఇవ్వకండి.. సమాచారం ఇవ్వండి అంటూ టోల్ ఫ్రీ నంబర్ 1064, మొబైల్ నంబర్, 9440446106 నంబర్లకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.