
ఆర్టీసీకి రాఖీ కట్నాలు..!
● ప్రయాణికులపై అదనపు చార్జీల భారం ● రూ.100కు రూ.50 పెంపు..! ● రద్దీతో అదనపు బస్సులు
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల ఆర్టీసీ బస్‌స్టేషన్ శుక్రవారం ప్రయాణికులతో కిటకిటలాడింది. తెల్ల వారితే శనివారం రాఖీ పండుగ కావడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో రద్దీగా మారింది. కాగజ్‌నగర్, గోదావరిఖని, చెన్నూర్ రూట్లలో రద్దీ ఎక్కువగా కనిపించింది. వచ్చిన బస్సు వచ్చినట్లే నిండిపోవడంతో కొందరు నిల్చుండి గమ్యస్థానానికి పయనమయ్యారు. మహాలక్ష్మి పథకంతో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన ఆర్టీసీ అవకాశం దొరికినప్పుడల్లా ప్రయాణికులపై చార్జీల భారం మోపుతోంది. హైదరాబాద్ జేబీఎస్, మియాపూర్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. రోజువారీ బస్సులతోపాటు శుక్రవారం మరో 12 బస్సులు నడిపించింది. పండుగ నేపథ్యంలో స్పెషల్ సర్వీసుల్లో అదనపు చార్జీల భారం మోపింది. సాధారణ రోజుల్లో నడిచే బస్సు చార్జీల కంటే రూ.100కు రూ.50 పెంచింది. సాధారణ రోజుల్లో సూపర్‌లగ్జరీ బస్సు చార్జీ రూ.530 ఉంటే స్పెషల్ సర్వీసుల్లో టికెట్ చార్జీలు రూ.740కు పెంచారు. ఈ లెక్కన ఒక్కో ప్రయాణికుడు రూ.210 అదనంగా చెల్లించాల్సి వచ్చింది. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మంచిర్యాల నుంచి జేబీఎస్‌కు రూ.390 ఉండగా.. అదనంగా రూ.160వరకు పెంచారు. శుక్రవారం రెండు స్పెషల్ సర్వీసులు నడిపించారు. పండుగ సమయంలో ప్రయాణికుల సౌకర్యార్థం అప్ ఖాళీగా వెళ్లి డౌన్(హైదరాబాద్ నుంచి) ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయడం జరుగుతుందని, పండుగ సమయంలో స్పెషల్ బస్సుల్లోనే చార్జీలు పెంపు వెసులుబాటు ఉంటుందని ఓ అధికారి తెలిపారు.