తేనెటీగల దాడిలో తాపీమేస్త్రీ మృతి
● మరో ఇద్దరికి గాయాలు
రెబ్బెన(ఆసిఫాబాద్): తేనెటీగల దాడిలో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. వివరాలు.. గోలేటి–1 ఇంకై ్లన్ ప్రహరీ మరమ్మతు పనులను కాంట్రాక్టర్ పైడిధర్‌కు అప్పగించారు. మంగళవారం ఉదయం మాదారానికి చెందిన తాపిమేస్తీ నర్సయ్య, మైలారపు శ్రీనివాస్, హిమండి దుర్గారావు ఈ పనులకు వెళ్లారు. ఈక్రమంలో పక్కనున్న చెట్టుపై ఉన్న తేనెటీగలు వీరిపై దాడి చేశాయి. ప్రాణభయంతో పరుగులు తీసినా నర్సయ్యకు తీవ్రగాయాలు, మిగతా ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. నర్సయ్యను గోలేటిలోని సింగరేణి డిస్పెన్సరీకి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, ముగ్గురు కుమార్తెలున్నారు. విషయం తెలుసుకున్న రెబ్బెన ఎస్సై చంద్రశేఖర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కాగా, నర్సయ్యకు ముగ్గురు కూతుళ్లుండగా అందరికీ వివాహాలయ్యాయి. పెద్దకూతురు సంధ్య అన్నీ తానై తండ్రి అంత్యక్రియలు నిర్వహించింది. ఏఐటీయూసీ నాయకులు ఎస్.తిరుపతి, మారం శ్రీనివాస్, ఐఎన్టీయూసీ నాయకులు పేరం శ్రీనివాస్, టీబీజీకేఎస్ నాయకులు గజ్జెల్లి చంద్రశేఖర్, అలవేణి సంపత్ ఏరియా ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి కుటుంబానికి రూ.3లక్షల పరిహారం ఇచ్చేలా కాంట్రాక్టర్‌తో మాట్లాడి ఒప్పించినట్లు వారు తెలిపారు.


