
పరిష్కారంలో అలసత్వం వద్దు
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ● ప్రజావాణిలో అధికారులకు సూచనలు
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వద్దని, త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్‌రావు, హరికృష్ణలతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
● చెన్నూర్ మండలం ఓత్కులపల్లి గ్రామ రైతులు అస్నాద్ శివారులో 55ఎకరాల భూమికి సంబంధించి విరాసత్ పట్టా అమలు చేయాలని దరఖాస్తు అందజేశారు.
● మంచిర్యాలకు చెందిన నంద్యాల చంద్రమౌళి రెడ్డి మంచిర్యాల సబ్ రిజిస్ట్రేషన్, రిజిష్టర్ కార్యాలయంలో అక్రమ వసూళ్లు, చట్ట వ్యతిరేక విధానాలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
● ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా ఇందిర మ్మ ఇల్లు మంజూరు కాలేదని, పేదలకు మంజూ రు చేయకుండా ఉన్నవాళ్లకే మంజూరు చేస్తున్నారని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకో వడం లేదని మందమర్రి మండలం కోటేశ్వర్‌పల్లి గ్రామానికి చెందిన తిరుపతి కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశాడు.
● తన కుమారుడు కొడిత్యాల లక్ష్మినారాయణకు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకుండా మంచిర్యాల కన్సల్టింగ్ ఏజెంటు శ్రీనివాస్, ఆర్డీవో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏడాది నుంచి వేధిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుని డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించాలని మంచిర్యాలకు చెందిన కొడిత్యాల వెంకటశివప్రసాద్ ఫిర్యాదు చేశారు.
జన్నారం: జన్నారం మండలం రేండ్లగూడ గ్రామ వైకుంఠధామం కోసం 1.25ఎకరాలు కొనుగోలు చేశామని, గ్రామానికి చెందిన రాజమౌళి అనే వ్యక్తి అక్రమంగా పట్టా చేయించుకున్నాడని, అక్రమ పట్టా రద్దు చేయాలని పీఏసీఎస్ చైర్మన్ రవి, మాజీ సర్పంచ్ ఆశరాజ్, ఏఎంసీ డైరెక్టర్ రాజన్న, మాజీ ఎంపీటీసీ వెంకటరాజం కోరారు.
41 కాదు.. 42కిలోలు జోకుతున్నారు..
మొదట కొనుగోలు చేసిన ధాన్యం బస్తాకు 41కిలోల చొప్పున తూకం వేశారు. మిల్లుకుపోయినా లారీ ఇంకా బస్తాలు దించుకోకుండా అక్కడే ఉంది. ఇప్పుడు కొనుగోలు కేంద్రాల్లో 41కిలోలు కాదు 42కిలోలు జోకుతున్నారు. తేమ 15శాతంలోపు వచ్చినా, తూర్పాల పట్టినా, చెత్తాచెదారం లేకుండా చేసినా బస్తాకు 42కిలోల ధాన్యం జోకుతున్నారు. తాలు, తప్ప ఉన్నా, నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చినా అందరికీ ఒకేలా 42కిలోలు తూకం వేస్తున్నారు. క్వింటాల్‌కు నాలుగు కిలో చొప్పున లారీ లోడు ధాన్యానికి రూ.30 వేల వరకు నష్టపోతున్నాం. అధికారులే కిలోకు రెండు కిలోలు జోకాలని ఆదేశాలు ఇస్తున్నారు. ఇదెక్కడి న్యాయం.. నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చిన రైతుల నుంచి తరుగు పేరుతో కోతలు లేకుండా కొనుగోలు చేయాలి. – రైతులు ఆర్.శ్రీకాంత్‌రెడ్డి, శివప్రసాద్‌రెడ్డి, జే.మల్లేష్, సతీష్, కిష్టాపూర్, జైపూర్

పరిష్కారంలో అలసత్వం వద్దు