
కార్మికులకు లాభాల్లో వాటా చెల్లించాలి
శ్రీరాంపూర్: కంపెనీ గత సంవత్సరం సాధించిన లాభాల నుంచి కార్మికులకు 45 శాతం వాటా చెల్లించాలని తెలంగాణ జన సమితి, తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు యాజమాన్యాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిజ్జన రమేష్, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం లీగల్ అడ్వయిజర్ రత్నకిరణ్, రాష్ట్ర అధ్యక్షుడు కామర గట్టయ్య హైదరాబాదులోని సింగరేణి భవన్‌లో సీఎండీ బలరాం నాయక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలని, ఇంటి నిర్మాణం కోసం రూ.20 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలని కోరారు. భూపాలపల్లి ఏరియాలో అకారణంగా డిస్మిస్ చేసిన కార్మికులకు ఉద్యోగం కల్పించాలని కోరారు. ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి కుమార్‌స్వామి, నాయకులు దేవి సత్యం, వెంగళ కనకయ్య, జైపాల్‌సింగ్ పాల్గొన్నారు.