
కార్మికుడిని పరీక్షిస్తున్న రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని రిమ్స్‌లో విధి నిర్వహణలోని ఓ కార్మికుడు మొదటి అంతస్తులోని సజ్జ నుంచి శనివారం ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రగాయాల పాలయ్యాడు. కాంట్రాక్ట్ ప్రతిపాదికన పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న గంగన్న విధుల్లో భాగంగా మొదటి అంతస్తులోని సజ్జపై ఉన్న చెత్తను శుభ్రపరుస్తున్నాడు. ఈ క్రమంలో సజ్జపై ఉన్న పాకురు కారణంగా కాలు జారీ కింద పడిపోయాడు. దీన్ని గమనించిన కార్మికులు వెంటనే రిమ్స్‌లోని అత్యవసర వార్డుకు తరలించి వైద్యులకు సమాచారమందించారు. ఈ విషయం తెలుసుకున్న రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్, సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్‌లు చికిత్స పొందుతున్న కార్మికుడిని పరామర్శించారు. వారు కూడా కార్మికుడిని పరీక్షించారు. అయితే సంబంధిత కాంట్రాక్టర్ కార్మికులకు సరైన సౌకర్యాలు కల్పించని కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు. కాగా కార్మికుడు గంగన్న మాట్లాడుతూ సజ్జపై అన్నం, చెత్త పేరుకుపోవడంతో దాన్ని శుభ్రం చేయడానికి పైకి ఎక్కినట్లు తెలిపారు. కాలుజారి కిందపడినట్లుగా వెల్లడించారు.