సేన-బీజేపీ జోడీపై మంత్రాంగం

Raut Approached Fadnavis For An Interview In Saamana - Sakshi

కీలక భేటీపై జోరుగా ఊహాగానాలు

ముంబై : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో శివసేన నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ భేటీ నేపథ్యంలో బీజేపీ, శివసేన మళ్లీ జట్టు కడతాయనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. వీరి భేటీపై పలు రకాలుగా ప్రచారం సాగుతోంది. శివసేన పత్రిక సామ్నాకు ఇంటర్వ్యూ కోసం రౌత్‌ దేవేంద్ర ఫడ్నవీస్‌ను సంప్రదించగా యథాతథంగా ప్రచురించాలని ఫడ్నవీస్‌ స్పష్టం చేశారని సమాచారం. మరోవైపు తన వ్యాఖ్యలను వక్రీకరించకుండా ఇంటర్వ్యూను పూర్తిగా తమ టీంతో ఫడ్నవీస్‌  రికార్డు చేయించినట్టు తెలిసింది. శివసేన అధిపతులు మినహా మరే నేత ఇంటర్వ్యూను సామ్నాలో ప్రచురించకపోవడంతో ఫడ్నవీస్‌తో రౌత్‌ ఇంటర్వ్యూ  ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంటర్వ్యూ సంగతి ఎలా ఉన్నా ఇరువురి నేతల మధ్యా రెండున్నర గంటల పాటు సాగిన భేటీపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి.

మహారాష్ట్రలో ప్రస్తుత శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నేతల్లో సంజయ్‌ రౌత్‌ ఒకరు. ఇక తాను సామ్నాను చదవనని, రౌత్‌ను సామ్నాను పట్టించుకోవద్దని జర్నలిస్టులకు సైతం దేవేంద్ర ఫడ్నవీస్‌ గతంలో సూచనలు చేసిన సంగతిని విమర్శకులు గుర్తు చేస్తున్నారు. ఇంతలోనే సామ్నా పట్ల, సంజయ్‌ రౌత్‌ పట్ల ఫడ్నవీస్‌ వైఖరిలో వచ్చిన మార్పేంటనే సందేహాలు ముందుకొచ్చాయి. మరోవైపు మహారాష్ట్రలో బీజేపీ-శివసేన ఒక్కటయ్యే సూచనలకు ఈ భేటీ సంకేతమని చెబుతున్నారు. శివసేనతో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ కొనసాగడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే పేర్కొనడం కూడా మహారాష్ట్రలో మారుతున్న రాజకీయ సమీకరణలకు సంకేతంగా భావిస్తున్నారు. పవార్‌ ఎన్డీయేలో చేరితే ఆయనకు భవిష్యత్‌లో కీలక పదవి దక్కుతుందనీ కేంద్ర మంత్రి చెప్పడం గమనార్హం. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన-ఎన్సీపీ సర్కార్‌ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ఊపందుకున్నాయనే వాదన ముందుకొస్తోంది.

ఇక ఫడ్నవీస్‌-రౌత్‌ల మధ్య జరిగిన భేటీలో బీజేపీ-సేన మళ్లీ దగ్గరవడం గురించి చర్చ సాగిందనే ప్రచారం ఒకటైతే బీజేపీతో మెరుగైన సంబంధాల కోసం సంజయ్‌ రౌత్‌ ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు. బీజేపీపై పలు అంశాలకు సంబంధించి రౌత్‌ విరుచుకుపడుతుండటంతో శివసేన ఎంపీ పట్ల కాషాయ నేతల్లో ఆగ్రహం​ వ్యక్తమవుతోంది. మహారాష్ట్ర సీఎం ఉద్థవ్‌ ఠాక్రేను మించి రౌత్ బీజేపీపై విమర్శల దాడికి ముందుండేవారు. తాజా పరిస్థితుల్లో సంజయ్‌ రౌత్‌ బీజేపీతో సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నారని, ఈ క్రమంలోనే ఫడ్నవీస్‌తో రౌత్‌ భేటీ అయ్యారని చెబుతున్నారు.

శివసేన-బీజేపీల మధ్య దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించేందుకే భేటీ జరిగిందని మరో వాదన తెరపైకి వస్తోంది. మరోవైపు మహారాష్ట్రలో కోవిడ్‌-19 పరిస్థితిని అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ విమర్శలు గుప్పించింది. ఈ వ్యవహారంలో కూటమి భాగస్వామ్య పక్షాలు ఎన్సీపీ, కాంగ్రెస్‌లను పట్టించుకోని బీజేపీ నేరుగా ఉద్థవ్‌ ఠాక్రే లక్ష్యంగా విమర్శలతో విరుచుకుపడింది. ఆదిత్య ఠాక్రేపైనా పలు సందర్భాల్లో బీజేపీ విమర్శలు గుప్పించింది. అయితే ఠాక్రేలపై బీజేపీ దూకుడు వైఖరిని తగ్గించే దిశగా రౌత్‌, ఫడ్నవీస్‌ల భేటీలో చర్చకు వచ్చిందని సమాచారం. సామ్నా ఇంటర్వ్యూ కోసమే ఫడ్నవీస్‌-రౌత్‌ భేటీ సాగినా రాజకీయాల్లో ఏ అంశాన్నీ కొట్టిపారేయలేం. చదవండి : ఉద్ధవ్‌ ఠాక్రేపై భగ్గుమన్న బాలీవుడ్‌ క్వీన్‌

Read latest Maharashtra News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top