చిన్నారుల ఎదుగుదలకు తల్లిపాలే శ్రీరామరక్ష | - | Sakshi
Sakshi News home page

చిన్నారుల ఎదుగుదలకు తల్లిపాలే శ్రీరామరక్ష

Nov 11 2026 1:19 AM | Updated on Nov 11 2026 1:19 AM

● ఆరు నెలల వరకు తల్లిపాలే ఇవ్వాలి.. రెండేళ్ల వరకు కొనసాగించాలి

● ఎదుగుదల లోపాలను తొలిదశలోనే గుర్తించాలి: కలెక్టర్‌

మహబూబ్‌నగర్‌ రూరల్‌: చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లిపాలు, పౌష్టికాహారం ఎంతో కీలకమని కలెక్టర్‌ ఖుష్బూగుప్తా అన్నారు. పిల్లల పోషణ, వ్యక్తిగత పరిశుభ్రత, శారీరక, మానసిక ఎదుగుదలపై తల్లులకు అవగాహన కల్పించాలని అంగన్‌వాడీ టీచర్లకు సూచించారు. జాతీయ పోషణ మాసం సందర్భంగా ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా స్టేట్‌ హోమ్‌లో ‘మన అంగన్‌వాడీ–మన బాధ్యత’ ఇతివృత్తంతో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిశువు పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఆ తర్వాత అదనపు పోషకాహారంతో పాటు రెండేళ్ల వరకు తల్లిపాలను కొనసాగించాలని సూచించారు. గర్భిణులు వైద్యుల సలహా మేరకు ఐరన్‌, కాల్షియం మాత్రలు వాడాలని తెలిపారు.

చిప్స్‌, చాక్లెట్లకు దూరంగా ఉంచాలి

చిన్నారులకు అధిక ఉప్పు, చక్కెర ఉండే ప్యాకెట్‌ ఆహారాలు, శీతల పానీయాలు ఇవ్వకూడదన్నారు. వాటికి బదులుగా పండ్లు, చిరుధాన్యాల జావ, పప్పులు, కూరగాయలు అందించాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రభుత్వ మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని, పోషక విలువల్లో రాజీ పడొద్దని స్పష్టం చేశారు.

ఎదుగుదల లోపాలను గుర్తించాలి

పిల్లల్లో వయస్సుకు తగ్గ శారీరక, మానసిక ఎదుగుదలను తల్లిదండ్రులు, అంగన్‌వాడీ టీచర్లు గమనించాలని కలెక్టర్‌ అన్నారు. మాటలు పలకడం, శబ్దాలకు స్పందించడం, నిలబడటం, నడవడం వంటి లక్షణాల్లో జాప్యం ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు తెలిపారు. అనంతరం శ్రీమంతం కార్యక్రమంలో గర్భిణులకు పండ్లు, పూలు, గాజులు, చీరలు అందజేశారు. అంగన్‌వాడీ టీచర్లతో పోషణ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ జరీనాబేగం, సీడీపీఓలు శైలశ్రీ, రూప, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement