● రెవెన్యూ రికార్డులతో క్షేత్రస్థాయి వివరాలు సరిపోల్చాలి
● రీసర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ హరిప్రియ
మహబూబ్నగర్ రూరల్: భూ రీసర్వేను ఎలాంటి తప్పులు, పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా చేపట్టాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియ అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని జన్నప్పపల్లిలో కొనసాగుతున్న రీసర్వే పనులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తయిన సర్వే, ఇంకా చేపట్టాల్సిన పనుల వివరాలను రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని ప్రైవేట్ వ్యవసాయ భూములు, ప్రభుత్వ భూముల విస్తీర్ణాలు, సరిహద్దులు, యాజమాన్య వివరాలను ఇప్పటికే ఉన్న రెవెన్యూ రికార్డులతో సరిపోల్చాలని సూచించారు. సర్వే నంబర్లు, భూముల విస్తీర్ణం, యాజమాన్య వివరాలు, వర్గీకరణను కచ్చితంగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. రికార్డుల్లోని వివరాలకు, క్షేత్రస్థాయిలో గుర్తించిన కొలతలకు మధ్య వ్యత్యాసాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రీసర్వేలో రైతులను భాగస్వాములను చేయాలని, వారి సందేహాలు, అభ్యంతరాలను సంబంధిత రికార్డుల ఆధారంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. భూముల వివరాల నమోదులో ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకుండా, రికార్డుల్లో వివరాలు గల్లంతు కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. రీసర్వేను పారదర్శకంగా, క్రమబద్ధంగా పూర్తి చేస్తే భవిష్యత్తులో భూ వివాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, డిప్యూటీ తహసీల్దార్ శ్యామ్సుందర్రెడ్డి, గిర్దావర్ రహీం, సర్వేయర్ బంగారప్ప పాల్గొన్నారు.


