కొత్తకోట రూరల్: దీపావళి పండుగ వేళ ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. ఇంటికి తోరణాలు కట్టేందుకు మామిడాకులు తీసుకొచ్చేందుకు వెళ్లిన ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం చర్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కొత్తకోట ఎస్‌ఐ ఎం.విక్రమ్ తెలిపిన వివరాల ప్రకారం.. చర్లపల్లికి చెందిన మొగులన్న (57) పండుగ సందర్భంగా వడ్డేవాటకు చెందిన నారాయణరెడ్డి మామిడి తోటకు వెళ్లి ఆకులు తెంపుకొని ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న పొలంలో వరి పంటను కాపాడుకునేందుకు మండ్ల కృష్ణయ్య అక్రమంగా విద్యుత్ తీగలను ఏర్పాటు చేశాడు. అయితే మార్గమధ్యలో ఉన్న విద్యుత్ తీగలు కనిపించకపోవడంతో మొగులన్న వాటిని తాకి విద్యుదాఘాతానికి గురై మరణించాడు. భర్త ఎంతసేపటికి ఇంటికి రాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో భార్య మన్నెమ్మ మామిడి తోట వద్దకు వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉన్నాడు. సర్పంచ్ శోభారాణికి చెప్పగా ఆమె పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి, పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎం.విక్రమ్ తెలిపారు. మృతుడికి భార్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు.
విద్యుదాఘాతంతోరైతు మృతి
పాన్‌గల్: విద్యుత్ షాక్‌తో రైతు మృతిచెందిన ఘటన సోమవారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ కుర్మయ్య కథనం ప్రకారం.. మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన పెద్ద గట్టయ్య(60) తనకున్న పొలంతోపాటు గ్రామానికి చెందిన చిన్నారెడ్డి పొలాన్ని కూడా కౌలుకు తీసుకొని వరిసాగు చేశాడు. ఆదివారం పెద్ద గట్టయ్య ఇంటినుంచి పొలానికి వెళ్లి రాత్రయినా.. ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి పొలంలో వెతకగా.. వరి పొలంలో మృతిచెంది ఉండటాన్ని గమనించారు. పొలంలోని విద్యుత్ మోటార్ వైర్ తేలి ఉండడంతో దానికి టేపు వేస్తుండగా విద్యుత్‌షాక్‌కు గురై మృతిచెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. మృతుడి కుమారుడు మద్దిలేటి సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పండుగ వేళల్లో ఇంటి యజమాని విద్యుత్ షాక్‌తో మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రైతు మృతితో గ్రామంలో విషాదఛాయాలు అలుముకున్నాయి.
విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించాలి
వ్యవసాయ పొలాల్లో విద్యుత్ మోటార్లు, వైర్లు, విద్యుత్ పరికరాల వద్ద సొంతంగా మరమ్మతులు చేయవద్దని, విద్యుత్ అధికారులను సంప్రదించి విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు నిర్ధారణ చేసుకున్న తర్వాతనే మరమ్మతు చేయాలని ఎస్‌ఐ రైతులకు సూచించారు. రైతులు ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని ఎస్‌ఐ సూచించారు.
నిలిచిన డీసీఎంనుఢీకొట్టిన బైక్
● యువకుడి దుర్మరణం
జడ్చర్ల: జాతీయ రహదారిపై నిర్లక్ష్యంగా నిలిపిన ఓ డీసీఎంను వెనుకనుంచి ఓ మోటర్ బైక్ ఢీకొన్న ప్రమాదంలో బైక్ నడుపుతున్న యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన జడ్చర్ల పరిదిలో 44వ నంబర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. సీఐ కమలాకర్ కథనం మేరకు.. వనపర్తి జిల్లా రేవల్లికి చెందిన జింకల విష్ణు(24) జడ్చర్లలోని విజయనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. పోలేపల్లి సెజ్‌లోని ఓ పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈనెల 8న రాత్రి తన బైక్‌ను తీసుకుని మాచారం గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా జాతీయ రహదారిపై ఎలాంటి ఇండికేటర్లు వేయకుండా నిర్లక్ష్యంగా నిలిపిన డీసీఎంను వెనుక నుంచి వస్తున్న మోటర్ బైక్ ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న విష్ణు అక్కడికక్కడే తీవ్ర గాయాలకు గురై మృతిచెందాడు. మృతుడి సోదరుడు వినోద్ ఫిర్యాదు మేరకు డీసీఎం డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి
కందనూలు: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నాగర్‌కర్నూల్ మండలం పెద్దముద్దునూర్‌కు చెందిన బొజ్జన్య (58) గ్రామ సమీపంలోని ఊరకుంట చెరువులో చేపల వేటకు వెళ్లాడు. చేపలు పట్టే సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో ఉన్న వల కాళ్లకు చిక్కుకొని బయటకు రాలేక నీట మునిగి చనిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


