మదనాపురం: కుటుంబ సభ్యులు తన పింఛన్ డబ్బులు వాడుకొని తిరిగి ఇవ్వకపోవడంతో ఓ దివ్యాంగులు రైల్వే విద్యుత్ టవర్ ఎక్కిన ఘటన మండల పరిధిలోని తిరుమలయ్యపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఘటన వివరాలిలా.. గ్రామానికి చెందిన చంద్రబాబు (45) పుట్టుకతోనే మూగ, చెవిటి వైకల్యంతో బాధపడేవాడు. అయితే రూ.10వేలు పింఛన్ సొమ్ము రావడంతో కుటుంబ సభ్యులే వాడుకున్నారు. డబ్బులు తిరిగి ఇమ్మని పలుమార్లు సైగలతో కోరినా ఇవ్వలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు మధ్యాహ్నం గ్రామ సమీపంలో ఉన్న 132 కేవీఏ రైల్వే విద్యుత్ టవర్ పైకి ఎక్కాడు. ఎంత బతిమిలాడినా దాదాపు సాయంత్రం 6 గంటల వరకు టవర్ దిగనని మొండికేశాడు. సమాచారం అందుకున్న కొత్తకోట ఫైర్ సిబ్బంది, ట్రాన్స్‌కో ఏఈ నర్సిములు, స్థానిక ఎస్‌ఐ జగదీశ్వర్ సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైల్వే అధికారులతో మాట్లాడి ముందు జాగ్రత్త చర్యగా కరెంటు సరఫరా నిలిపివేయించారు. దాదాపు 20 నిమిషాల పాటు కరెంటు నిలిపివేయడంతో గద్వాల నుంచి జడ్చర్ల మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఫైర్ సిబ్బంది సాహసోపేత రక్షణ
తీవ్రమైన ఎండలో టవర్‌పైనే ఉండటంతో దాహంతో అల్లాడిపోయాడు. కిందకు దిగలేని నిస్సహాయ స్థితికి చేరుకోవడంతో పరిస్థితిని గమనించిన ఫైర్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించారు. నిచ్చెనలు, సురక్షిత రోప్‌ల సాయంతో టవర్‌పైకి ఎక్కి నెమ్మదిగా కిందకు తీసుకొచ్చారు. సురక్షితంగా కిందకు చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాధితునికి కౌన్సెలింగ్ ఇచ్చి సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
20 నిమిషాల పాటు జడ్చర్ల–గద్వాల మధ్య రైళ్లకు అంతరాయం


