దేశవాళీ క్రికెట్‌లో గణేష్‌ అడుగు | - | Sakshi
Sakshi News home page

దేశవాళీ క్రికెట్‌లో గణేష్‌ అడుగు

Nov 10 2026 12:55 AM | Updated on Nov 10 2026 12:55 AM

● సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీకి హెచ్‌సీఏ జట్టులో చోటు

● ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి తొలిసారిగా ఎంపిక

మహబూబ్‌నగర్‌ క్రీడలు: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మరికల్‌ మండలం వెంకటాపూర్‌కు చెందిన గ ణేష్‌ గడుగు క్రికెట్‌లో తనదైన ముద్ర వేస్తున్నాడు. జిల్లాస్థాయి నుంచి ప్రస్థానం ప్రారంభించి రాష్ట్ర, జా తీయ స్థాయి పోటీల్లో రాణించిన ఈ యువ క్రికెటర్‌ తాజాగా ప్రతిష్టాత్మక సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీకి హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) సీనియర్‌ పురుషుల జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఈ టోర్నీకి ఎంపికై న తొలి క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు.

ట్రిపుల్‌ సెంచరీలతో సత్తా..

2013లో జిల్లా క్రికెట్‌లో అడుగుపెట్టిన గణేష్‌.. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ పోటీల్లో పలుమార్లు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించాడు. 2019లో జరిగిన ఎంపీఎల్‌–5 టోర్నీలో జేఆర్‌ వారియర్స్‌ తరఫున ఆడి బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణించి మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. హెచ్‌సీఏ అండర్‌–16, అండర్‌–19, అండర్‌–23 జట్లకు జిల్లా నుంచి పలుమార్లు ప్రాతినిధ్యం వహించాడు. హెచ్‌సీఏ కంబైన్డ్‌ జిల్లా జట్టులోనూ చోటు సంపాదించాడు. 2019–20 హెచ్‌సీఏ ఏ–2 డివిజన్‌ లీగ్‌ సీజన్‌లో గణేష్‌ తన బ్యాటింగ్‌ ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించాడు. రాజు క్రికెట్‌ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 200 బంతుల్లో 42 ఫోర్లు, ఏడు సిక్సర్లతో అజేయంగా 318 పరుగులు చేశాడు. అదే సీజన్‌లో మరో మ్యాచ్‌లో 329 పరుగులు సాధించి రెండు ట్రిపుల్‌ సెంచరీలతో సంచలనం సృష్టించాడు. 2024 సీనియర్‌ జోనల్‌ క్రికెట్‌ టోర్నీలో కంబైన్డ్‌ జట్టు తరఫున రెండు మ్యాచ్‌ల్లో కలిపి 350 పరుగులు సాధించాడు. 2024–25 సీజన్‌లో హెచ్‌సీఏ రంజీ జట్టుకు తొలుత స్టాండ్‌బైగా ఎంపికై , ఆ తర్వాత తుది 15 మంది జట్టు లోనూ స్థానం సంపాదించాడు.

ఇంగ్లండ్‌ లీగ్‌ల్లోనూ

ప్రాతినిధ్యం..

గత ఏడాది ఇంగ్లండ్‌లో జరిగిన వెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూఈపీఎల్‌) ప్రీమియర్‌–2 డివిజన్‌, సీనియర్‌ చెల్టెన్‌హామ్‌ ప్రీమియర్‌ టీ20, డబ్ల్యూఈపీఎల్‌ టీ20, నేషనల్‌, కంట్రీ కప్‌ టోర్నీల్లో ఆడాడు. ఈ ఏడాది జరిగిన టీజీ–20 లీగ్‌లో 251 పరుగులు సాధించాడు. ఇటీవల ముగిసిన సీనియర్‌ మెన్స్‌ సూపర్‌ లీగ్‌ 2026–27లో మూడు మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీతో కలిపి 270 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

ముస్తాక్‌ అలీ ట్రోఫీకి ఎంపిక..

బీసీసీఐ నిర్వహించే దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ 2026–27 సీజన్‌కు హెచ్‌సీఏ సీనియర్‌ పురుషుల జట్టులో గణేష్‌ చోటు దక్కించుకున్నాడు. ఈ నెల 14 నుంచి బెంగాల్‌ వేదికగా టోర్నీ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో రాణించి మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా క్రికెట్‌ వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి.

భారత జట్టుకు ఎంపిక కావడమే లక్ష్యం..

చిన్నప్పటి నుంచి క్రికెట్‌ అంటే ఇష్టం. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ప్రాక్టీస్‌ చేస్తుంటాను. ఎండీసీఏ వారు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీలో పాల్గొనే హెచ్‌సీఏ జట్టులో చోటు దక్కించుకోవడం సంతోషంగా ఉంది. భవిష్యత్తులో భారత జట్టుకు ఎంపిక కావడమే నా లక్ష్యం. అందుకోసం నిరంతరం శ్రమిస్తాను. – గణేష్‌ గడుగు, క్రికెటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement