జడ్చర్ల టౌన్: జడ్చర్ల మున్సిపాలిటీలో చెత్త సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. కావేరమ్మపేట సమీపంలోని చీకూరిగుడిసెల వద్ద చెత్త వేయవద్దంటూ స్థానిక రైతులు అడ్డుకోవడంతో సోమవారం చెత్త సేకరణ వాహనాలు నిలిచిపోయాయి. డంపింగ్‌యార్డుకు వెళ్లే దారిలో రైతులు కందకాలు తవ్వడంతో చెత్తతో నిండిన వాహనాలను మున్సిపల్ కార్యాలయం ఎదుట నిలిపివేశారు. సాయంత్రం పోలీసులు జోక్యం చేసుకుని రైతులతో మాట్లాడటంతో చెత్తను డంపింగ్‌యార్డులో తరలించారు. అయితే మంగళవారం నుంచి చెత్త వేయడానికి వీల్లేదని రైతులు స్పష్టం చేయడంతో సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు లభిస్తుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నాలుగేళ్లుగా రైతుల ఆందోళన
జడ్చర్ల మున్సిపాలిటీకి పూర్తిస్థాయి డంపింగ్‌యార్డు లేకపోవడంతో చాలాకాలంగా కావేరమ్మపేట సమీపంలోని చీకూరిగుడిసెల వద్ద చెత్తను డంప్ చేస్తున్నారు. నాగసాల సమీపంలోని గుట్ట వద్ద కూడా గతంలో చెత్త వేసేవారు. అయితే అక్కడ డంపింగ్‌యార్డు నిర్మాణానికి ఆటంకాలు ఎదురవడంతో చెత్త వేయడం నిలిపివేశారు. మరోవైపు చీకూరిగుడిసెల వద్ద చెత్త వేయవద్దంటూ స్థానిక రైతులు, గ్రామస్తులు నాలుగేళ్లుగా ఆందోళన చేస్తున్నారు. చెత్తను తగులబెట్టడం వల్ల వెలువడే పొగతో వాయుకాలుష్యం ఏర్పడి ఇళ్లలో ఉండలేకపోతున్నామని రైతులు చెబుతున్నారు. చెత్త నుంచి వెలువడే వ్యర్థాలు భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయని, వర్షాకాలంలో చెత్తలోని మురుగునీరు పంట పొలాల్లోకి చేరి పంటలకు నష్టం కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలువురు మున్సిపల్ కమిషనర్లు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదని ఆరోపిస్తున్నారు.
ఉద్రిక్తత.. పోలీసుల జోక్యం
సాయంత్రం మరోసారి చెత్త వాహనాలను డంపింగ్‌యార్డుకు తీసుకెళ్లగా రైతులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది. అదే సమయంలో చేరుకున్న పోలీసులు రైతులతో మాట్లాడి చెత్తను డంప్ చేయించారు. అయితే మంగళవారం నుంచి డంపింగ్‌యార్డులో చెత్త వేయడానికి అనుమతించబోమని రైతులు తేల్చిచెప్పారు.
మున్సిపల్ కార్యాలయం వద్ద నిలిపి ఉంచిన చెత్త వాహనాలు
చెత్తతో సహా కార్యాలయం వద్దకు
చీకూరిగుడిసెల వద్ద చెత్త వేయకుండా రైతులు సోమవారం కందకాలు తవ్వడంతో వాహనాలు డంపింగ్ యార్డుకు వెళ్లలేకపోయాయి. గతంలో గంగాపురం, నసురుల్లాబాద్ రోడ్ల వెంట చెత్తను వేసి తగులబెట్టడాన్ని ఆయా గ్రామాల ప్రజలు వ్యతిరేకించారు. దీంతో ఎక్కడ చెత్త వేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. చివరకు చెత్తతో నిండిన వాహనాలను మున్సిపల్ కార్యాలయం ఎదుట నిలిపివేశారు. విషయం తెలుసుకున్న కమిషనర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కావేరమ్మపేట డంపింగ్‌యార్డులో చెత్త వేయకుండా అడ్డుకున్న రైతులు
కందకాలు తవ్వి చెత్త వాహనాలను అడ్డుకున్న వైనం
జడ్చర్ల మున్సిపల్ కార్యాలయం
ఎదుట నిలిచిన చెత్త బండ్లు
నాలుగేళ్లుగా సమస్య.. పరిష్కారానికి నోచుకోని వైనం


