జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఏళ్ల తరబడి పెంకుటిళ్లలో నివసిస్తూ సొంతింటి కోసం ఎదురుచూసిన పేద కుటుంబాల కల ఇందిరమ్మ ఇళ్ల పథకంతో నెరవేరుతోంది. సొంతింటిలో తొలి దీపావళి జరుపుకుంటున్న లబ్ధిదారుల ఆనందంలో కలెక్టర్ ఖుష్బూగుప్తా పాలుపంచుకున్నారు. ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లాకేంద్రంలోని 15వ వార్డు చిన్నదర్పల్లిలో లబ్ధిదారులు మూడవత్ మంజుల, సభవత్ పద్మశ్రీ కుటుంబాలతో కలిసి పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులకు టపాసులు, స్వీట్లు అందజేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. వారిని శాలువాలతో సత్కరించి, కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు కాల్చి వేడు కల్లో పాల్గొన్నారు. ఒకప్పుడు సొంతింటి కోసం ఎదురుచూసిన కుటుంబాలు నేడు తమ ఇంట్లోనే పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన నిరుపేదలకు సొంత గృహాలు నిర్మించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయగా, రెండో విడతలో అదనంగా మరో 2,000 ఇళ్లను కేటాయించినట్లు వివరించారు. అర్హులైన పేదలందరికీ దశలవారీగా ఇళ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పటివరకు 3,845 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2.30 లక్షల ఇందిరమ్మ ఇళ్లలో గృహప్రవేశాలు జరిగాయని పేర్కొన్నారు. కొత్తింట్లో తొలి దీపావళి జరుపుకుంటున్న లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మూడవత్ మంజుల, సభవత్ పద్మశ్రీ మాట్లాడుతూ.. గతంలో పెంకుటిళ్లలో నివసించిన తమకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించి సొంతింటి కలను నెరవేర్చిందని ఆనందం వ్యక్తం చేశారు. కలెక్టర్ స్వయంగా తమ ఇళ్లకు వచ్చి పండుగ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతోనే తమకు సొంతింటి కల నెరవేరిందని పేర్కొన్నా రు. గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఉపేందర్‌రెడ్డి, డిప్యూటీ ఈఈ విజయ్‌కుమార్, ఏఈలు శ్రీను, వైష్ణవి, 15వ వార్డు కార్పొరేటర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి పండుగ జరుపుకున్న కలెక్టర్
‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమం
జిల్లాలో ఇప్పటివరకు 3,845 ఇళ్ల నిర్మాణాలు పూర్తి


