ఎర్రవల్లి: శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో ఆదివారం సీతారాముల కల్యాణ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సీతారాములను అపురూపంగా ముస్తాబుచేసి వేదమంత్రాల నడుమ వైభవంగా కల్యాణతంతు జరిపించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో బీచుపల్లికి చేరుకొని పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో సీతారాముల కల్యాణంలో పాల్గొని కార్యక్రమాన్ని కనులారా తిలకించారు. కల్యాణానికి హాజరైన భక్తులకు ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.


