జడ్చర్ల: ‘జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి సంబంధించి రూ.25 కోట్ల డీడీ ఇద్దరం కట్టి పట్టణ సీనియర్ల వద్ద పెడదాం.. స్థలం కేటాయిస్తే నీ డీడీ నువ్వు తీసుకో.. నా డీడీతో ఆస్పత్రి నిర్మాణ పనులు చేపడుతా.. స్థలం కేటాయింపు జీఓ తీసుకురాకపోతే నీవు కట్టిన డీడీతో జడ్చర్ల అభివృద్ధికి నిధులు వెచ్చిద్దాం’ అని మాజీమంత్రి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డికి ప్రతి సవాల్ విసిరారు. ఆదివారం ఆయన జడ్చర్లలో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మళ్లీ తనపై చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులు ఇబ్బందులు పడుతున్నారని, రాత్రి కూడా ఓ రోగి విషమ పరిస్థితిలో ఉంటే ఇతర ఆస్పత్రికి రెఫర్ చేశారన్నారు. ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బందిని నియమించి రోగులకు వైద్యసేవలు అందించాలని హితవు పలికారు. మొదట ప్రహరీ లేకపోవడంతో ఆస్పత్రి ఆవరణలోకి వరద పారిందని, దాన్ని సాకుగా చూపి ఆస్పత్రి గుంతలో ఉందని పదే పదే చెప్పడం భావ్యం కాదని, ఆ పక్కనే ఉన్న లేఅవుట్ వెంచర్‌కు సమాంతరంగా ఆస్పత్రి ఉందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇద్దరం రూ.5 కోట్లు డీడీ కడదామని సవాల్ విసిరారు. వెంచర్‌లోని ఇళ్లకు లెవెల్‌గా తీసుకుని ఆస్పత్రిని చూస్తే తెలుస్తుందన్నారు. పట్టణానికి చెందిన సీనియర్లు, ఇంజినీరింగ్ అధికారులను తీసుకెళ్లి గుంతలో ఉందని ధ్రువీకరిస్తే తన రూ.5 కోట్లు డీడీ ఇస్తానని లేదంటే రాజకీయంగా ఎన్నికలలో పోటీ చేయబోనని, అలా లేకపోతే ఎమ్మెల్యే రూ.5 కోట్లు డీడీ ఇచ్చి రాజీనామా చేయాలన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి కట్టుబడి ఉన్నానని, ఎంపీ ఎన్నికలలో బీజేపీకి మద్దతు ఇచ్చినట్లు చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. తాను దేవాదాయ భూమిని ఎప్పుడు కొనుగోలు చేయలేదన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారంగా ఉన్న పట్టా భూమిని కొనుగోలు చేసి తిరిగి విక్రయించానని చెప్పారు. సమావేశంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ యాదయ్య, నాయకులు ప్రశాంత్‌రెడ్డి, జ్యోతి, నందకిషోర్, దానిష్ తదితరులు పాల్గొన్నారు.


