ఆగుతూ.. సాగుతూ! | - | Sakshi
Sakshi News home page

ఆగుతూ.. సాగుతూ!

Nov 2 2026 12:29 AM | Updated on Nov 2 2026 12:29 AM

త్వరలో ప్రక్రియ..

ఇదీ పరిస్థితి..

భూ సేకరణలో నిర్లక్ష్యం..

ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై పాలకులు, అధికారుల చిత్తశుద్ధిని వేలెత్తి చూపేలా చేస్తోంది. తెలంగాణ వైపు సోమశిల (మల్లేశ్వరం) 87.360 కి.మీ., నుంచి ఏపీ అవతల సిద్దేశ్వరం గుట్ట 88.437 కి.మీ., వరకు 1,077 మీటర్ల పొడవునా తీగల వంతెన నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇది పూర్తయితేనే రెండు రాష్ట్రాల మధ్య రాకపోకల సమస్య తీరుతుంది. ఇందుకోసం 59 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉండగా.. ఇందులో 25 హెక్టార్ల అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా అమ్రాబాద్‌ మండలంలో భూమి కేటాయించారు. మరో 34 హెక్టార్లకు సంబంధించిన పరిహారం చెల్లింపు ఆలస్యమవుతోంది.

నాగర్‌కర్నూల్‌ వద్ద బైపాస్‌ నిర్మాణానికి సంబంధించి 4 కి.మీ. మేర భూసేకరణ పెండింగ్‌లో ఉంది. 24.28 ఎకరాల భూ సేకరణ పూర్తయితే పనులు వేగంగా సాగుతాయి. తాడూరు వైపు నుంచి నిలిచిన పనులు ప్రారంభించాం. కొల్లాపూర్‌ చౌరస్తా నుంచి భూసేకరణ అనంతరం పనులు మొదలవుతాయి. కొట్ర వద్ద 600 మీటర్ల పనులు చేయాల్సి ఉంది. కోర్టు కేసుతో నిలిచింది. జాతీయ రహదారుల నిబంధనల ప్రకారం వంతెనలు నిర్మిస్తున్నాం.

– రమేశ్‌,

డీఈఈ, జాతీయ రహదారుల సంస్థ

అచ్చంపేట: ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే కల్వకుర్తి – నంద్యాల జాతీయ రహదారి–167కే పనులు ముందుకు సాగడం లేదు. పూర్తిస్థాయిలో భూ సేకరణ జరగకపోవడం పనులకు అడ్డంకిగా మారింది. 2021లో ప్రభుత్వం 173.73 కి.మీ., ఎన్‌హెచ్‌–167కే మంజూరు చేస్తూ.. ఐదు ప్యాకేజీలుగా విభజించింది. మొదటి దశ పనులు 2022 సెప్టెంబర్‌లో కల్వకుర్తి (కొట్రా) నుంచి సోమశిల రహదారి విస్తరణ, బైపాస్‌ నిర్మాణాలకు టెండర్లు ఆహ్వానించారు. ఈ పనులను రూ.436.91 కోట్లకు ఓ సంస్థ దక్కించుకోగా.. 2023 జూలైలో అధికారికంగా పనులను ప్రారంభించారు. ఇప్పటికీ మూడేళ్లు దాటినా జాతీయ రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి.

వంతెన వెడల్పు, ఎత్తు..

నాగర్‌కర్నూల్‌ – శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారి మీదుగా జాతీయ రహదారి–167కే బైపాస్‌ వెళ్తుంది. అయితే కొల్లాపూర్‌ చౌరస్తాలోని జిల్లా పోలీసు కార్యాలయం సమీపంలో చేపడుతున్న బైపాస్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులు తరలించే వాహనాలు, భారీ యంత్ర పరికరాలు తరలించే వాహనాలకు తక్కువ ఎత్తున్న వంతెనతో ఇబ్బందులు తలెత్తుతాయని స్థానికులు సందేహిస్తున్నారు. ఈ రహదారిపై మొత్తం నాలుగు వంతెనలు ఉండగా.. కల్వకుర్తి, సింగోటం క్రాస్‌రోడ్డు, పెంట్లవెల్లి రహదారిలో పూర్తి కాగా.. నాగర్‌కర్నూల్‌ వద్ద మాత్రమే పెండింగ్‌లో ఉంది. ప్రస్తుత రహదారిని పరిగణలోకి తీసుకుని 18 ఫీట్ల ఎత్తులో నిర్మిస్తున్నారు. అయితే వంతెన ఎత్తు సరిపోదని.. అలాగే రెండు పిల్లర్ల మధ్య రోడ్డు వెడల్పు 22 మీటర్లు మాత్రమే ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. భవిష్యత్‌లో భూత్పూర్‌– మన్ననూర్‌– మద్దిమడుగు రహదారి జాతీయ రహదారిగా మారే అవకాశం ఉందని.. నాగర్‌కర్నూల్‌ ఆర్టీసీ డిపో నుంచి కొల్లాపూర్‌ చౌరస్తా వరకు నాలుగు వరుసల రహదారిగా విస్తరించేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారని.. ఫ్లైఓవర్‌ బ్రిడ్జి 30 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేయకుండా, తగ్గించడం వల్ల ఇబ్బందులు తప్పవని అభిప్రాయపడుతున్నారు.

మందకొడిగా 167కే జాతీయ రహదారి పనులు

హైవే నిర్మాణానికి అడ్డంకిగా మారిన భూ సేకరణ

నాగర్‌కర్నూల్‌ వద్ద నిలిచినబైపాస్‌ ఫ్లైఓవర్‌ పనులు

మూడేళ్లు దాటినా పూర్తికాని రహదారి

కల్వకుర్తి నుంచి కొల్లాపూర్‌ బైపాస్‌లోని సోమశిల రహదారి వరకు 79 కి.మీ. నిర్మాణానికి గాను ఇప్పటి వరకు 74.5 కి.మీ. మేర 10 మీటర్ల వెడల్పుతో రెండు వరుసల బీటీ పనులు పూర్తయ్యాయి. కొట్ర వద్ద శ్రీశైలం జాతీయ రహదారి–765ని కలుపుతూ చేపట్టాల్సిన 600 మీటర్ల రోడ్డు పనులు సైతం కోర్టు కేసు వల్ల నిలిచిపోయాయి. కల్వకుర్తి, సింగోటం క్రాస్‌రోడ్డు, పెంట్లవెల్లి వద్ద అండర్‌ పాస్‌లు నిర్మించారు. నాగర్‌కర్నూల్‌ వద్ద 11 కి.మీ. బైపాస్‌ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ జరగకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. తాడూరు నుంచి నాగర్‌కర్నూల్‌ వరకు 7 కి.మీ. మేర భూ సేకరణ పూర్తికాగా.. కొల్లాపూర్‌ క్రాస్‌రోడ్‌ నుంచి దేశిఇటిక్యాల వరకు 4 కి.మీ. మేర భూసేకరణ పూర్తి కాలేదు. రోడ్డు నిర్మాణం కోసం 24.28 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా.. అవసరమైన మేర చెల్లింపులు జరపకపోవడాన్ని పరిశీలించాలని బాధిత రైతులు కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే భూ సేకరణకు ఇచ్చిన 60 రోజుల గడువు పూర్తయినా అడుగు ముందుకు పడటం లేదు. ఫలితంగా నాగర్‌కర్నూల్‌ వద్ద బైపాస్‌ నిర్మాణం పిల్లర్లకే పరిమితమైంది. భూసేకరణ సమస్యతో కొల్లాపూర్‌ వరిదేల రెవెన్యూ శివారు 79 కి.మీ. నుంచి మల్లేశ్వరం (సోమశిల) కృష్ణానది గుట్ట 87,360 కి.మీ (ఐకానిక్‌ వంతెన) వరకు 8 కి.మీ. అప్రోచ్‌ రోడ్డు పనులు కూడా నిలిచిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement