నవాబుపేట: కరువు వచ్చినా పంటలు పండించుకునేందుకు సాగునీరు నిల్వ ఉంచాలన్న ఉద్దేశంతోనే అప్పటి సీఎం కేసీఆర్ ముందుచూపుతో కాళేశ్వరం, పాలమూరు లాంటి ప్రాజెక్టులు నిర్మించారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ మాత్రం ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చి.. నిర్లక్ష్యం ఫలితంగా రైతులకు తీవ్ర దుర్భిక్షం వచ్చిపడిందని ఆరోపించారు. ఆదివారం మండలంలోని దర్పల్లి, అమ్మాపూర్ గ్రామాల్లో వరి పంట ఎండిన రైతుల పొలాలను మండల నాయకులతో కలిసి పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్కో గ్రామంలో వందలాది ఎకరాల పంటలు ఎండుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. పాలన చేతకాక రాజకీయ కూతలతో కాలం గడుపుతున్న కాంగ్రెస్‌కు రైతులపై, ప్రజలపై కనీసం ద్యాస కూడా లేదని మండిపడ్డారు. ఎల్‌నినోతో కరువు విలయతాండవం చేస్తుంటే కరువు ప్రాంతంగా ప్రకటించాల్సింది పోయి కుంటిసాకులు చెబుతున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాలమూరును కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తాజా పరిస్థితులపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తామే తప్ప రాజకీయ విమర్శలు చేయడం లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింహులు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రవీందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


