పాలమూరు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలోని పలు పాఠశాలల్లో పోక్సో చట్టం–2012పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని ఎదిర ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఏనుగొండ కేజీబీవీలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు న్యాయమూర్తి డి.ఇందిర హాజరై మాట్లాడారు. అదేవిధంగా ఏనుగొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, షాసాబ్‌గుట్ట ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశానికి న్యాయమూర్తి మహ్మద్ మునవార్, జడ్చర్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోక్సో చట్టం అవగాహన కార్యక్రమానికి న్యాయమూర్తి మహ్మద్ ముదసిర్ హాజరయ్యారు. అదేవిధంగా నగరంలోని ప్రజ్ఞా హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా మూడో అదనపు న్యాయమూర్తి అనిత హాజరై మాట్లాడారు. ఇటీవల కాలంలో బాలలపై లైంగిక వేధింపులు పెరిగాయని, వాటిని కట్టడి చేయడానికి తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులు, సంబంధిత అధికారుల పాత్ర ఎంతో కీలకమన్నారు. బాలలకు సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.


