మహబూబ్‌నగర్ (వ్యవసాయం): ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడంతోపాటు సన్నరకం ధాన్యం సేకరణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ హరిప్రియ అన్నారు. శుక్రవారం జిల్లాలోని పీసీసీ కేంద్రాల ఇన్‌చార్జిలకు పీసీఎస్‌ఏపీ, ఓపీఎంఎస్ విధానాలు, నిర్వహణ మార్గదర్శకాలపై రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడు రకాల సన్నధాన్యాల గుర్తింపు, కొనుగోలు విధానాలపై అధికారులకు అవగాహన కల్పించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అవసరమైన ఫొటో ఆధారాలను పీసీఎస్‌ఏపీ పోర్టల్‌లో ఎలాంటి జాప్యం లేకుండా అప్‌లోడ్ చేయాలని సూచించారు. పోర్టల్‌లో ఆధారాలను జాగ్రత్తగా నమోదు చేసి లెవెల్–3 సాధించేలా చర్యలు తీసుకోవాలని పీపీసీ కేంద్రాల ఇన్‌చార్జిలను ఆదేశించారు. కేంద్రాలకు ధాన్యం రాకను బట్టి కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ శ్రీనివాస్, డీఎం రవినాయక్, జేడీ గోవింద్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.


