జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): నిరుద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు పట్టభద్రులు సిద్ధంగా ఉ న్నారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకులు, విద్యార్థులతో మాట్లాడి పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అవసరమైన నోటిఫికేషన్లు విడుదల చేయకుండా నిరుద్యోగులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు అత్యంత బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఓటు హక్కుకు అర్హులైన ప్రతి పట్టభద్రుడిని గుర్తించి, వారందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాలన్నారు. జిల్లాలో పట్టభద్ర ఓటర్ల నమోదు చాలా తక్కువగా ఉందని డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ నవంబర్ 6లోగా ఓటుహక్కు నమోదు చేసుకోవాలని కోరారు. ఇందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఓటరు నమోదు కేంద్రాలను పట్టభద్రులు వినియోగించుకోవాలని సూచించారు.


