మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: రాజకీయాల కోసం జిల్లాల మధ్య సాగు, తాగునీటి విషయంలో తగాదాలు సృష్టించడం మాని తక్షణమే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాలనరసింహ డిమాండ్ చేశారు. దీనికోసం అఖిలపక్ష కమిటీ సభ్యులను ఢిల్లీకి తీసుకొని వెళ్లడానికి మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ చొరవ చూపాలన్నారు. శుక్రవారం సురవరం వెంకటరామారెడ్డి భవన్‌లో జరిగిన జిల్లా సమితి సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ సంస్థలపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధను చూపిస్తూ కరువు జిల్లాల ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు కరువు ప్రాంతాలుగా ప్రకటించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, పశువులకు దాణా, పశుగ్రాసం కొరతను తీర్చాలన్నారు. నిత్యావసర ధరలు పెరుగుతున్నా నివారించడంలో ఎందుకు విఫలమయ్యారో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా కోట్లాది ఓట్లను తొలగించిన సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్ మాట్లాడుతూ జిల్లాలో సాగు, తాగునీరు, నగరంలోని డంపింగ్ యార్డు, భూకబ్జాలు తదితర సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు శంకర్‌నాయక్, గోవర్ధన్, రాము, సురేష్, పద్మావతి, భాష, ఆంజనేయులు, సత్యనారాయణరెడ్డి, అమర్‌జ్యోతి, మహేష్‌బాబు, దేవానంద్, బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.


