జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఉమ్మడి పాలమూరు జిల్లాకు దక్కాల్సిన కృష్ణానది నీళ్లను పాలమూరు జిల్లాకు కాకుండా నల్గొండకు తరలించే డిండి ప్రాజెక్ట్‌ను వెంటనే రద్దు చేయాలని ఉమ్మడి పాలమూరు పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. జేఏసీ జిల్లా కన్వీనర్ బెక్కం జనార్దన్ ఆధ్వర్యంలో డిండి ప్రాజెక్టును రద్దు చేయాలనే డిమాండ్‌తో నిర్వహిస్తున్న లక్ష సంతకాల సేకరణలో భాగంగా శుక్రవారం జిల్లా కోర్టు ఆవరణలో లాయర్లతో సంతకాలు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు బిడ్డనని చెప్పుకునే సీఎం జిల్లాకే నష్టం చేసే నిర్ణయం తీసుకోవడం సిగ్గచేటని మండిపడ్డారు. పాలమూరు–రంగారెడ్డి నీళ్లు డిండి పేరుతో నల్లగొండకు తరలించే కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పాలమూర్–రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధుల వరద పారించి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న జల సాధన పోరాటానికి న్యాయవాదులు మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్‌రావు, కార్యదర్శి నర్సింహారెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకటయ్య, వెంకటేశ్, చంద్రమౌలి, అనంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జూరాలకు స్వల్పంగా వరద
అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఐదు రోజుల నుంచి స్వల్పంగా వరద వచ్చి చేరుకుంటుంది. సగటున 600 వందల క్యూసెక్కుల నుంచి క్రమంగా 1100 క్యూసెక్కుల వరకు వరద చేరుతోంది. శుక్రవారం 600 క్యూసెక్కుల వరద వచ్చినట్లు ఏఈ సుదర్శన్ తెలిపారు. ఎగువన ఉన్న నారాయణ పూర్ డ్యాం నుంచి నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోవడంతో ప్రస్తుతం ప్రాజెక్టులో 3.298 టీఎంసీల నీటి మట్టం ఉంది. జూరాల ఆయకట్టుకు వారాబంది ద్వారా సాగునీటిని వదులుతున్న ప్రాజెక్టు అధికారులు ఈసారి ఎగువ నుంచి వరద వచ్చి చేరితేనే నవంబర్ చివరి నాటిని సాగునీటిని విడుదల చేస్తామన్నారు.


