జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు గుర్తించిన ప్రమాదకర ప్రాంతాల్లో భద్రతా చర్యలను వేగవంతం చేసి, పెండింగ్ పనులను నిర్ధేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఎస్పీ డి.జానకితో కలిసి జిల్లా స్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాలానగర్ జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద నవంబర్ 15లోగా ఒకవైపు రహదారిపై వాహనాల రాకపోకలను ప్రారంభించాలని, మరోవైపు పనులు నవంబర్ 30 లోగా పూర్తి చేయాలని సూచించారు.
వాహన తనిఖీలపై నివేదిక ఇవ్వాలి
రవాణా శాఖ అధికారులు ప్రతి నెల నిర్వహిస్తున్న వాహన తనిఖీల వివరాలను తదుపరి సమావేశంలో సమగ్రంగా సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. తనిఖీ చేసిన వాహనాల సంఖ్య, నమోదు చేసిన కేసులు, అవసరమైన ధ్రువపత్రాలు లేని వాహనాలపై తీసుకున్న చర్యలు, విధించిన జరిమానాల వివరాలను అందించాలని సూచించారు.
రూ.1.5 లక్షల ఆర్థికసాయం
రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సాయం అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రమాదం జరిగిన 24 గంటల్లోగా సమాచారం అందించడం, బాధితులను సకాలంలో ఆస్పత్రికి తరలించడం ప్రధానమంత్రి రాహత్ పథకం కింద రూ.1.50 లక్షల ఆర్థికసాయం పొందేందుకు కీలకమని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి నిర్మల, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారుల శాఖ, పోలీసు, మున్సిపల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.


