జడ్చర్ల: నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి కనీస అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో రూ.73 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం వనమహోత్సవంలో కాలనీ వాసులకు మొక్కలు పంపిణీ చేసి మాట్లాడారు. తమపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. వైద్య ఆరోగ్య మంత్రిగా ఉండి ఆయన ఆస్పత్రి అభివృద్ధికి ఏంచేశారని ప్రశ్నించారు. జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తాము స్థలం కేటాయిస్తే మళ్లీ ఆస్పత్రి నిర్మిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రిగా ఉండి కూడా నియోజకవర్గానికి ఆశించిన విధంగా ప్రయోజనం చేయలేకపోయారని విమర్శించారు. భూముల వ్యవహారాలపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై పెట్టలేదన్నారు. జడ్చర్లకు సీఎం పర్యటనల సందర్భంగా ఇచ్చిన నిధులు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. ఉదండాపూర్ రిజర్వాయర్ కోసం రూ.650 కోట్లు ఇచ్చారని, మిడ్జిల్ మండలంలో ప్రతి గ్రామపంచాయతీకి రూ.50 లక్షలు ఇచ్చారని ఇవన్నీ కనిపించడం లేదా అంటూ ధ్వజమెత్తారు. దసరా పండుగకు సీఎం ముఖ్య అతిథిగా వస్తే నిధులు అడిగే సంప్రదాయం తమకు లేదన్నారు. తాను వ్యక్తిగత రాజకీయాలకంటే నియోజకవర్గం అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తామన్నారు. జడ్చర్ల అభివృద్ధికి సంబంధించి వాస్తవాలను శుక్రవారం జరిగే మీడియా సమావేశంలో వెల్లడిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ చైర్‌పర్సన్ పుష్పలత,మాజీ కౌన్సిలర్ చైతన్య చౌహాన్,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వంశీచారీ,తదితరులు పాల్గొన్నారు.


