మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ/ మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: కర్నూలు, గద్వాల, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్‌లోని మలక్‌పేట్ జంక్షన్‌లో అన్ని రైళ్లు ఆపాలని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ రాష్ట్ర (ఆర్‌యూపీపీ టీఎస్) గౌరవాధ్యక్షుడు విజయకుమార్ కోరారు. ఈ మేరకు గురువారం మహబూబ్‌నగర్‌లోని బీజేపీ కార్యాలయంలో ఎంపీ డీకే అరుణను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ మార్గంలో నిత్యం వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు రాకపోకలు సాగిస్తుంటారన్నారు. మలక్‌పేట్ స్టేషన్‌లో రైళ్లను ఆపితే అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు నాగేశ్వర్, అక్తర్‌పాషా, అలీం తదితరులు పాల్గొన్నారు.
● పీయూలో లా, ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులకు వెంటనే హాస్టల్ సదుపాయం కల్పించాలని కోరుతూ విద్యార్థులు ఎంపీ డీకే అరుణకు వినతిపత్రం అందజేశారు. దీంతో సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని ఆమె వీసీకి సూచించారు. అలాగే పీయూ పార్ట్‌టైం అధ్యాపకులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంపీకి వినతిపత్రం అందజేశారు. పీయూలో ఎక్కువ కాలంగా పనిచేస్తున్న పార్ట్‌టైం వారికి రెగ్యులర్ అధ్యాపకుల నియామకాల్లో వెయిటేజీ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో అధ్యాపకులు రామరాజు, శివశంకర్, రవీందర్‌గౌడ్, అరుణ పాల్గొన్నారు.


