● విద్యుత్ ఆదాతో పాటు నీటి లభ్యతను
దృష్టిలో ఉంచుకోవాలి
● రూరల్ జోన్ చీఫ్ ఇంజినీర్ బాలస్వామి
రాజాపూర్: రైతులు విద్యుత్‌ను ఆదా చేయడంతో పాటు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేయాలని రూరల్ జోన్ చీఫ్ ఇంజినీర్ బాలస్వామి సూచించారు. మంగళవారం రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లిలో నిర్వహించిన ప్రజాబాట–పొలంబాట కార్యక్రమంలో భాగంగా రైతులు సాగు చేస్తున్న వరి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులు, విద్యుత్ వినియోగదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలస్వామి మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా ఉన్నప్పటికీ బోర్లలో నీరు లేకపోతే రైతులకు ఇబ్బందులు తప్పవని అన్నారు. అందువల్ల వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయలు, ఇతర ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. ముదిరెడ్డిపల్లిలో జనాభా ఎక్కువగా ఉన్నందున గ్రామానికి 24 గంటల విద్యుత్ సరఫరా కల్పించాలని సర్పంచ్ మీణాశేఖర్‌గౌడ్ ఎస్‌ఈ బీమానాయక్‌ను కోరారు. దీనిపై స్పందించిన ఎస్‌ఈ.. ప్రతిపాదనలు పంపిస్తే పరిశీలిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఈ బీమానాయక్, జడ్చర్ల డీఈ చంద్రమౌళి, రాజాపూర్ ఏడీఈ నవీన్‌కుమార్, ఏఈ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.


