దేవరకద్ర: కౌకుంట్ల రైల్వే స్టేషన్ సమీపంలోఉన్న శ్రీలక్ష్మీ వెంకటేశ్వర వేర్‌హౌస్ గోదాముల గేట్లకు సోమవారం తాళం వేసి ఽహామాలీలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. లోపలికి లారీలు వెళ్లకుండ అడ్డుకున్నారు. గత నెలలో పలుమార్లు ఆందోళనలు చేసినప్పడు యాజమాన్యం తరపున ఈవీ భాస్కర్ హమాలీలతో చర్చించి అక్టోబర్ 27న డిపాజిట్ డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చారు. గడువు తేదీ దగ్గరపడుతున్నా యాజమాన్యం స్పందించకపోవడంతో సోమవారం హమాలీలు మరోసారి ఆందోళనకు దిగారు. ఈవీ భాస్కర్ ఇంటివద్దకు వెళ్లగా గోదాముల వద్దకు వెళ్లాలని తెలపడంతో సామూహికంగా వేర్ హౌస్ గోదాముల వద్దకు చేరుకుని గేట్లకు తాళం వేసి నిరసన తెలిపారు. ఉదయం నుంచి మధ్యహ్నం వరకు ధర్నా ఆందోళన చేపట్టారు. దీంతో దిగివచ్చిన యాజ మాన్యం హమాలీలతో మరో సారి చర్చించారు. హ మాలీ పనిలో చేరడానికి ఒక్కొక్కరి నుంచి రూ. 30 వేలు వసూలు చేశారని, మరి కొందరితో రూ. 50 వేలు డిపాజిట్‌లు తీసుకుని హమాలీ పని ఇచ్చారని కాని రెండేళ్ల క్రితం తమను పనుల నుంచి తొలగించారని వాపోయారు. ఇప్పటికి చెల్లించిన డిపాజిట్‌లు తిరిగి ఇవ్వలేదన్నారు. దాదాపు రూ. 70 లక్షల వరకు డిపాజిట్లు ఉన్నాయని వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. నవంబర్ 3న చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తామని ఆ రోజు రావాలని యాజమాన్యం తరపున ప్రతినిధులు సూచించారు. దీంతో హమాలీలు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో హమాలీ ప్రతినిధులు సాంబశివుడు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.


